హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో జరిగిన భారీ ప్రమాద ఘటనకు బాధ్యులను గుర్తించాల్సి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. బాధ్యుల గుర్తింపు, ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని తెలుపుతూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రమాదంలో 46 మంది మృతి చెందటం, 8 మంది అదృశ్యమైన సంఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించినట్టు తెలిపారు. కమిటీ నుంచి నివేదిక అందాల్సి ఉన్నదని తెలిపారు. బాధితులకు అన్ని ప్రభుత్వ శాఖలు చట్టప్రకారం అండగా నిలిచాయని పేర్కొన్నారు.
సిగాచి సంఘటనపై సిట్‌తో సత్వర దర్యాప్తు జరిపించాలని, బాధితుల కుటుంబాలకు వెంటనే సాయం అందలేదంటూ హైదరాబాద్‌కు చెందిన కే బాబూరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఈ కౌంటర్‌ను దాఖలు చేశారు. కలెక్టర్, కార్మికశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, పోలీసులు, పరిశ్రమల శాఖల నుంచి నివేదికలు తెప్పించి హైకోర్టుకు సమర్పించారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే హైడ్రా నుంచి 265 మంది, ఎన్డీఆర్ఎఫ్ నుంచి 25, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపకశాఖ 350, జిల్లా పోలీసులు 200, టీజీఎస్పీ ప్లాటూన్స్ 9 సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు. అత్యవసర పునరావాస కేంద్రం, మెడికల్ క్యాంపు ఏర్పాటుచేసి.. బాధితులను దవాఖానలకు తరలించారని వివరించారు. శిథిలాల్లో నుంచి శాంపిల్స్ సేకరించి మృతదేహాల గుర్తింపు నిమిత్తం ఫోరెన్సిక్‌కు పంపినట్టు తెలిపారు.