హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, శ్రీ పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 19 నుంచి 23వరకు మొదటి విడత సంయుక్త కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జీఈ సీఎచ్ విద్యాసాగర్ తెలిపారు. రాజేంద్రనగర్లోని వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
తొలిసారిగా బీఎస్సీ(అగ్రికల్చర్)లో 15%, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) సీట్లలో 15% వ్యవసాయ కూలీల పిల్లలకు ప్రత్యేక కోటా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. 4వ తరగతి నుంచి 12వ తరగతుల విద్యాభ్యాసంలో కనీసం నాలుగేండ్లు ప్రభుత్వ పాఠశాల, కళాశాల, గురుకులాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ఈ ప్రత్యేక కోటాకు అర్హులని తెలిపారు. గ్రామీణ ఉపాధి హమీ పథకం కార్డు కలిగి ఉన్న వారే ఈ కోటాకు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www.pjtau.edu.in ను సంప్రదించాలని సూచించారు.