హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లకు ఈ నెల 30న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు వైద్యశాఖ తెలిపింది. మొత్తం 121 మందితో సీనియార్టీ జాబితా విడుదల చేసింది. వాస్తవానికి ఈ నెల 20న సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ల బదిలీలు జరగాల్సి ఉన్నది. సీనియార్టీ, ఖాళీల జాబితాలో తప్పులు దొర్లాయన్న ఆరోపణల నేపథ్యంలో కౌన్సెలింగ్ ఆగిపోయింది. దీంతో తాజాగా కొత్త జాబితా విడుదల చేశారు. దీనిపైన కూడా నర్సులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పాత జాబితాలో బదిలీ అయ్యేవారి సంఖ్య 126 మందికాగా, కొత్త జాబితాలో ఐదుగురి పేర్లు తగ్గాయని అంటున్నారు. ఒకేచోట 30 ఏండ్లుగా పనిచేస్తున్న ఓ నర్సు పేరు కూడా మాయమైందని చెప్తున్నారు. ఇలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
5 నుంచి జేఎల్ అభ్యర్థులకు వెరిఫికేషన్
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి 1:2, 1:5 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 11 వరకు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషనర్ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొదలవుతుందని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్లు ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఇచ్చుకోవచ్చని తెలిపారు. జాబితాను కమిషన్ వెబ్సైట్లో పెట్టినట్టు వివరించారు.
గ్రూప్-4 దివ్యాంగులకు 30 నుంచి వైద్య పరీక్షలు
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన గ్రూప్-4 దివ్యాంగుల అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి ఆగస్టు 5 వరకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్నికోలస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్రగడ్డలోని మెంటల్ కేర్ ప్రభుత్వ దవాఖానలో నిర్వహించే పరీక్షలు ఆటిజం, మానసిక రుగ్మత, మందబుద్ధి అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. షె డ్యూల్ను వెబ్సైట్లో ఉంచినట్టు పేర్కొన్నారు.
31న డీఏవో ప్రాథమిక ‘కీ’
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్) గ్రేడ్-2 పరీక్షల ప్రాథమిక కీని https://ww w.tspsc.gov.inలో ఈ నెల 31న విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్నికోలస్ తెలిపారు. కీపై అభ్యంతరాలను ఆగస్టు 1 నుంచి 5 వరకు కమిషన్ వెబ్సైట్ లింక్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు.