హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ‘ఎప్‌సెట్ ఫలితాలు రాగానే తల్లిదండ్రులు, విద్యార్థులకు ఒకటే టెన్షన్. ఏ ర్యాంకుకు.. ఏ కాలేజీలో.. ఏ కోర్సులో సీటు వస్తుంది? అని సందేహాలు ఉంటాయి. ఏ కాలేజీ మంచిది? వాటిల్లో ఫీజులెలా ఉంటాయి? ప్లేస్‌మెంట్స్ పరిస్థితేంటి? అనే అంశాలు అడ్మిషన్ తీసుకోవడంలో కీలకంగా మారుతాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది.
ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ సమాచారం మొత్తం ఒకేచోట అందించేందుకు వీలుగా ఉన్నత విద్యామండలి వెసులుబాటు చర్యలు చేపట్టింది. ఎప్‌సెట్ కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌తో కాలేజీల వెబ్సైట్లను అనుసంధానించేలా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ వెసులుబాటు వల్ల కాలేజీల పూర్తి సమాచారం, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, ట్యూషన్, హాస్టల్ ఫీజులు, ప్లేస్‌మెంట్స్ హిస్టరీ, న్యాక్ గ్రేడింగ్ గురించి తెలుసుకోవచ్చని, విద్యార్థులు, తల్లిదండ్రులకు శ్రమ తప్పుతుందని విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి చెప్పారు.