హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ)/న్యూస్ నెట్వర్క్: పత్తి కొనుగోళ్లు నిలిపేస్తామన్న జిన్నింగ్ మిల్లుల హెచ్చరికలతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దిగొచ్చింది. సోమవారం ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తమ సమస్యను సీఎండీ దృష్టికి తీసుకెళ్లిన మిల్లర్లు.. ఈ నిబంధనలను సడలించే వరకు పత్తి కొనుగోళ్లు చేపట్టబోమని స్పష్టంచేశారు.
పత్తి కొనుగోళ్లలో కొత్తగా అమలు చేసిన ఎల్1, ఎల్2, ఎల్3 విధానాన్ని నిలిపివేసి పాత పద్ధతిలోనే ఒకేసారి అన్ని మిల్లుల్లో కొనుగోలుకు అంగీకరించారు. ఫలితంగా తమ నిరసనను విరమించుకుంటున్నట్టు మిల్లు యాజమాన్యాలు ప్రకటించాయి. మధ్యాహ్నం నుంచి అన్ని జిన్నిం గ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు యథావిధంగా ప్రారంభమయ్యాయి.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన పత్తికి నిబంధనలు విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా యజమానులు ఆందోళన చేపట్టారు. జిన్నింగ్లను మూసివేసి నిరసన తెలిపారు. ఫలితంగా రాష్ట్ల్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ముందస్తు సమాచారం లేకుండా కొనుగోళ్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, నిర్మల్ జిల్లా భైంసాలో రైతులు రోడ్డెక్కారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కాంటాలు నిలిచిపోవడంతో రైతులు మండిపడ్డారు.