వేములవాడ, నవంబర్ 25: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ఖజానా ఖాతా లో జమైన రైతు ఏదుల సత్తెమ్మకు చెందిన పత్తి డబ్బులు రూ.2,14,549 ఆలయ అధికారులు తిరిగి ఆమె ఖాతాకు బదిలీ చేయించారు. సత్తెమ్మ సీసీఐకి అమ్మిన పత్తి పంట డబ్బులు రాజన్న ఆలయ బ్యాంకు ఖాతాలో జమైన విషయం మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితం కాగా, ఆలయ అధికారులు బ్యాంకులో ఎన్వోసీ ఇవ్వడంతో వారు ఆ మొత్తాన్ని రైతు ఖాతాలో జమచేశారు. ఆధార్ అనుసంధానించి ఉండటంతో సత్తెమ్మకు కేంద్రం నుంచి వచ్చే గ్యాస్ సబ్సిడీ రూ.47 సైతం ఆలయ ఖాతా లో జమ అవుతున్నట్టు తెలిసింది. ఈ డబ్బును ఆలయానికి సమర్పించే కానుకలుగా సరిచేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయంపైనా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.