హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ) : పత్తి కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పత్తి రైతులకు శాపంగా మారింది. ఇప్పటికే మద్దతు ధర లభించక, పత్తి కొనుగోళ్లు చేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై తాజాగా మరో పి డుగు పడింది. ఈ నెల 17 నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపేస్తామని రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అసోసియేషన్ లేఖ రాసింది. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులను మూసివేస్తామని సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ప్రకటించారు.
సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. ఆ తర్వాత పట్టించుకోకపోవడంపై జిన్నింగ్ మిల్లర్లు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోళ్లలో జిన్నింగ్ మిల్లులకు సీసీఐ కొత్తగా అమల్లోకి తెచ్చిన ఎల్1, ఎల్2, ఎల్3 నిబంధనను వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిబంధనల వల్ల కొన్ని మిల్లులకే పత్తి వస్తుందని, మిగతా మిల్లులకు పత్తి రాకపోవడంతో అవి నష్టపోతాయని చెప్తున్నారు. కాబట్టి ఈ నిబంధనను ఎత్తేసి అన్ని మిల్లులకు పత్తి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మొదట ఈ నెల 6 నుంచే జిన్నింగ్ మిల్లులను బంద్ చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. కాగా ప్రభుత్వం చర్చలు జరిపి ఈ నెల 10 వరకు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బంద్‌ను తాత్కాలింగా వాయిదా వేశారు. కానీ ప్రభుత్వం ఆ తర్వాత వారిని పట్టించుకోకపోవడం, సమస్యలు పరిష్కరించకపోవడంతో మళ్లీ బంద్‌కు నిర్ణయించారు. ఈసారి సమస్యలు పరిష్కరిస్తేనే జిన్నింగ్ మిల్లులు ఓపెన్ చేసి పత్తి కొనుగోలు చేస్తామని, లేదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేసేది లేదని తేచ్చి చెప్తున్నారు. కాగా మొత్తం 325 మిల్లులను నోటిఫై చేయగా ప్రస్తుతం 256 మిల్లులను ఓపెన్ చేశారు. ఇంకా 69 మిల్లులనే ఓపెన్ చేయాల్సి ఉన్నది.
ఈ సీజన్ పత్తి రైతులకు పీడకలనే మిగుల్చుతున్నది. ఇప్పటి వరకు అకాల వర్షాలతో పత్తి మొత్తం తడిసిపోయి దిగుబడి తగ్గిపోయింది. దీనికి తోడు పత్తి కొనుగోళ్లపై సీసీఐ పెడుతున్న నిబంధనలు, కొర్రీలతో రైతులకు మరింత నష్టం జరుగుతున్నది. ముఖ్యంగా 12 శాతం తేమ నిబంధనతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వర్షాలకు పత్తి తడిసిపోవడంతో తేమ శాతం అధికంగా ఉంటున్నది. అలాంటి పత్తి కొనుగోలుకు సీసీఐ అంగీకరించడంలేదు. దీంతోపాటు రంగుమారిన పత్తిని కూడా కొనుగోలు చేసేందుకు సీసీఐ నిరాకరిస్తున్నది. పోనీ బహిరంగ మార్కెట్లో విక్రయిద్దామనుకుంటే మద్దతు ధర రూ. 8,110 ఉండగా మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు రూ. 6వేలకే కొంటున్నారు.
ఇటు సీసీఐ కొనుగోలు చేయక.. అటు ప్రైవేట్ వ్యాపారులు ధర ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు మొన్నటి వరకు ఎకరానికి 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ ఇప్పుడు ఈ పరిమితిని 7 క్వింటాళ్లకే కుదించింది. వర్షాలకు చెడిపోగా మిగిలిన పత్తినైనా అమ్ముకుందామనుకుంటే సీసీఐ అదికారులు కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మొత్తం 25 లక్షల టన్నులు కొనాలని లక్ష్యంగా పెట్టుకున్న సీసీఐ, పత్తి కొనుగోళ్లను ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 1.11 లక్షల టన్నులే కొనుగోలు చేసింది.
పత్తి కొనుగోళ్ల బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్‌ను మంత్రి తుమ్మల కోరారు. ఇప్పటికే 325 మిల్లులకు 256 ఓపెన్ చేయించామని, మిగిలిన 69 మిల్లులను కూడా తొందరగానే ఓపెన్ చేయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 69 మిల్లుల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని తెలిపారు. దీనిపై కేంద్ర జౌళిశాఖతో చర్చలు జరపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శిని ఆదేశించారు.
కాశీబుగ్గ, నవంబర్ 14 : తమ సమస్యలను ఈనె 16లోగా పరిష్కరించాలని లేకపోతే 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తామని కాటన్ మిల్లర్స్ అండ్ జిన్నింగ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీపీఐ) వారు ఎల్1, ఎల్2, ఎల్3 పేరుతో కొన్ని మిల్లులు నడిపి మరికొన్ని నడపకపోవడంతో జిన్నర్స్ ఆర్థికంగా నష్టపోతున్నారని, అలాగే కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్టు చెప్పారు. 17వ తేదీ నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఈ బంద్
కొనసాగుతుందని చెప్పారు.