హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ‘ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు కలగవద్దు.. ‘అత్యవసరమైతే’ కావాల్సిన పరికరాలు కొనుగోలు చేయండి’.. పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు సూచన ఇది. అంతే!.. ‘అత్యవసరమైతే’ అన్న ఒక్క పదాన్ని అడ్డుపెట్టుకొని రెండు శాఖల ఉన్నతాధికారులు కొందరు భారీ అవినీతికి తెరలేపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరికరాల కొనుగోళ్ల పేరుతో ప్యాడీ క్లీనర్స్, ప్యాడీ డ్రయర్స్ కొనుగోలుకు ప్లాన్ వేసినట్టు సమాచారం. మూడు సంస్థలను కొందరు ఉన్నతాధికారులు ‘రికమెండ్’ చేశారని, టెండర్లు లేకుండానే కొటేషన్ పద్ధతిలో పరికరాల సరఫరా బాధ్యత కట్టబెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పరికరాల కొనుగోలు వ్యవహారం సివిల్ సప్లయ్, మార్కెటింగ్ శాఖల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
టెండర్ లేదు.. కొటేషనే!
సాధారణంగా ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన పరికరాలను ఏటా హాకా, ఆగ్రోస్ ద్వారా మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసి, పౌరసరఫరాల శాఖకు అందజేస్తుంది. ఈ క్రమంలో హాకా, ఆగ్రోస్ సంస్థలు టెండర్లు పిలుస్తుంటాయి. అయితే ఇటీవలి యాసంగి సీజన్ సమయంలో ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మార్కెటింగ్ శాఖ కొన్ని పరికరాల కొనుగోలును హాకాకు అప్పగించి, ఆగ్రోస్‌ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టు సమాచారం. ‘అత్యవసరం’ అనే దాన్ని సాకుగా చూపి జిల్లాల్లో వ్యవహారం నడిపించారని, జిల్లా కొనుగోలు కమిటీ(డీపీసీ) ద్వారా కొనుగోలు చేశారని తెలిసింది. ధాన్యం కొనుగోళ్లపై గతంలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల, శ్రీధర్‌బాబు సమీక్ష నిర్వహించిన సందర్భంగా.. రైతులకు ఇబ్బంది లేకుండా అత్యవసరమైతే అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలని సూచించినట్టు ఓ అధికారి తెలిపారు. ఇదే ఆసరాగా మార్కెటింగ్, సివిల్ సప్లయ్ శాఖల అధికారులు కుమ్మక్కై ఇప్పటివరకు ఉన్న విధానాన్ని పక్కనపెట్టారని, జిల్లాల్లో నేరుగా భారీ సంఖ్యలో పరికరాలు కొనుగోలు చేసే విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారని చెప్తున్నారు.
ఈ మేరకు జిల్లాలకు సర్క్యులర్ జారీ చేసేశారు. ఒకవేళ డీపీసీ ద్వారా కొనుగోలు చేసినా.. టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కానీ ప్యాడీ క్లీనర్స్‌కు సంబంధించి ఎలాంటి టెండర్లు పిలవలేదని, కొటేషన్ విధానంలో కట్టబెట్టినట్టు తెలిసింది. ఏ కంపెనీలకు అప్పగించాలో సివిల్ సప్లయ్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగానే మూడు కంపెనీలను ఎంపిక చేసి, వాటికి కొటేషన్లు ఇప్పించినట్టు సమాచారం. ఈ కంపెనీలు కూడబలుక్కొని తలా కొన్ని జిల్లాలు దక్కించుకున్నట్టు సమాచారం. ఒక్కో జిల్లాకు తొలిదశలో 30 వరకు ప్యాడీ క్లీనర్లు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800 నుంచి 1000 వరకు కొనుగోలు చేశారని సమాచారం. ఒక్కో యంత్రానికి రూ. 2 లక్షల చొప్పున రూ.20 కోట్లు వెచ్చించినట్టు తెలిసింది. విలువైన పరికరాలను ఇంత భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నప్పుడు.. టెండర్లు పిలవకుండా, కొటేషన్ పద్ధతిలో కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డ్రయర్స్ కోసం అడ్వాన్స్ చెల్లింపు
ప్యాడీ డ్రయర్స్ కొనుగోళ్ల కథ మరోలా ఉన్నది. జిల్లాకు రెండు చొప్పున మొత్తం 70 వరకు డ్రయర్స్ కొనుగోలు చేయాలని సివిల్ సప్లయ్ శాఖ నిర్ణయించిందట. వీటి కొనుగోలు కోసం కంపెనీలకు పరికరం విలువలో 50 శాతాన్ని అడ్వాన్స్‌గా చెల్లించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక ప్రభుత్వ సంస్థ ఇలా పరికరాల కొనుగోలుకు అడ్వాన్స్ చెల్లించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఒక్కో ప్యాడీ డ్రయర్ విలువ రూ.14 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిసింది. వాస్తవానికి ప్యాడీడ్రయర్ విలువ బహిరంగ మార్కెట్లో రూ.11 నుంచి 12 లక్షల వరకు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అంటే అదనంగా ఒక్కో డ్రయర్పై రూ.2 లక్షలు చెల్లిస్తున్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఈ లెక్కన దాదాపు రూ.1.40 కోట్లు తేడా వస్తున్నదని చెప్తున్నారు. ఇంత విలువైన పరికరాలనూ డీపీసీల ద్వారానే కొనుగోలు చేస్తుండడం అనుమానాలకు తావిస్తున్నది. తూతూ మంత్రంగా టెండర్లు పిలిచి, తమకు కావాల్సిన కంపెనీలకు కట్టబెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మెషీన్ల కొనుగోలుకు రాష్ట్ర స్థాయిలో ఒకేసారి టెండర్లు పిలిస్తే ఎక్కువ కంపెనీలు పోటీ పడి, ధర తక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, కానీ జిల్లా స్థాయిలో పిలవడంతో ఖజానాకు నష్టం వాటిల్లిందని విమర్శిస్తున్నారు.
సీజన్ ముగిసిన తర్వాత..
ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఇబ్బందులు ఏర్పడితే అత్యవసర పరిస్థితి అంటారు. కానీ జిల్లాల్లో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు పూర్తయిపోయాయి. అయినా అధికారులు మాత్రం ఇప్పుడు కూడా ‘అత్యవసరం’ పేరుతో పరికరాలు కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఓ అధికారిని వివరణ కొరగా.. ధాన్యం కొనుగోళ్ల సమయంలోనే ఆర్డర్ ఇచ్చామని, ఇప్పుడు అవి డెలివరీ అవుతున్నాయని తెలిపారు. అయితే ప్రభుత్వానికి అవసరమైన సమయంలో పరికరాలను కంపెనీలు సమకూర్చనప్పుడు ఏం లాభమని, ఇప్పుడు వాటిని తీసుకొని ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. సమయానికి సరఫరా చేయకపోతే ఒప్పందాలు రద్దు చేసి, టెండర్లకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.