హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 1,200 మంది నుంచి రూ.5 వేల చొప్పున రూ.60 లక్షల వరకు అక్రమ వసూళ్లు.. 20 ఏండ్లకు పైగా పరారీలో ఉన్న ఓ అధికారి వద్ద రూ.5 లక్షలు తీసుకొని ఇష్టారీతిన మళ్లీ పోస్టింగ్.. ప్రమోషన్లలో భారీగా వసూళ్లు.. ఇవీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో జరిగే అవినీతి, అవకతవకలకు మచ్చుతునకలు. ఆ శాఖ కీలక విభాగాధిపతి కనుసన్నుల్లోనే అధికారులంతా ఒక్కటై యథేచ్ఛగా ఇలాం టి అక్రమ వసూళ్లకుతెగబడుతున్నారు. ప్రతి పనికీ ఓ రేట్ చొప్పున ఆమ్యామ్యాలు పుచ్చుకుంటున్నారు. వరుస అవినీతి ఆరోపణలతో గతంలోనే ఆ శాఖకు చెందిన ఆ కీలక విభాగాధిపతి సహా ఏడుగురు అధికారులకు సర్కారు షోకాజ్ నోటీసులను సైతం జారీచేసింది. అవినీతి బాగోతంపై విచారణకు అదే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిని సైతం ప్రభుత్వం నియమించింది. అయినా ఆ శాఖ అధికారుల తీరులో ఏ మాత్రం మార్పు రాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారులు, సిబ్బంది ప్రమోషన్లు, కీలక ఫైళ్లు ముందుకెళ్లాలంటే ఆ శాఖలోని అధికారుల చేతులు తడపాల్సిందేనని అదే శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. కీలక విభాగంలో తమ పనుల కోసం వచ్చే సిబ్బంది.. సంబంధిత శాఖ అధికారులను కలిసి తమ ఫైళ్లు అప్పజెప్పాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారు ఫైళ్లు పెట్టేందుకు తమ చుట్టూ సిబ్బందిని తిప్పించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక ఆ అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు సిబ్బంది స్వయంగా జేబులు తడపాల్సి వస్తుందని తెలిసింది. అధికారులను దాటిన ఫైల్ విభాగాధిపతి టేబుల్‌పైకి చేరాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు టాస్క్ మొదలవుతున్నట్టు సమాచారం. ప్రతీ ఫైలుకు ఓ రేట్ ఫిక్స్ చేసి సిబ్బంది నుంచి ముక్కుపిండి సదరు శాఖ అధికారులు నగదు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రమోషన్లకే రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్టు పలువురు వాపోతున్నారు. ఉద్యోగుల వార్షిక, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లకు, కొత్తగా నియమితులైన ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజేషన్ వంటి చిన్న ఫైళ్లను సైతం నగదుకు ఆశపడి ఉద్దేశపూర్వకంగా క్లియర్ చేయడం లేదని ఆరోపణలున్నాయి. ఉద్యోగులు ఏదైనా కారణంతో దీర్ఘకాలిక సెలవులు పెడితే వాటిని మంజూరు చేసేందుకు సైతం డబ్బు ముట్టజెప్పాల్సిన దుస్థితి ఉన్నదంటే ఆ శాఖలో అవినీతి ఏ స్థాయిలో రాజ్యమేలుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
పెద్దలకే సవాల్‌గా మారిన విభాగాధిపతి!
ఆ శాఖ కీలక విభాగాధిపతి తీరు అదే శాఖ పెద్దలకు సైతం సవాల్‌గా మారింది. ఆయనతోపాటు కొందరు అధికారులపై గతంలో ఆరోపణలు తీవ్రమవడంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. చర్యలకు సైతం ప్రభుత్వ పెద్దలు ఉపక్రమించారు. ఇక తనపై వేటు తప్పదనే భావనకు వచ్చిక ఆ కీలక విభాగాధిపతి పీఎంవోలో పనిచేసే తన సోదరుడిని రంగంలోకి దించి చక్రం తిప్పినట్టు సమాచారం. సదరు ఉన్నతాధికారికి షోకాజ్ నోటీసులు అందినా, అవినీతి ఆరోపణలు హెచ్చు మీరుతున్నా, లెక్క చేయకుండా మళ్లీ అవినీతి దందాకు తెరలేపినట్టు ఆరోపణలున్నాయి. తన అవినీతికి ఎవరు అడ్డొచ్చినా వారిపై కీలక విభాగాధిపతి బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నట్టు గుసగుసలు. సదరు అధికారి తీరుపై ఆ శాఖలో పనిచేసే ఉన్నతస్థాయి అధికారులు సైతం పెదవి విరుస్తున్నారు.
సదరు శాఖ కీలక విభాగాధిపతికి ఆరోగ్యశాఖ మంత్రి పేషీ కన్నా ఎక్కువ మంది అధికారులు ఉండటం సైతం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు ఓఎస్డీలు, ఇద్దరు ఆఫీసు సూపరింటెండెంట్లు, మరో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు డీఈవోలు, ఆరుగురు అటెండర్లు ఆ విభాగంలో పనిచేస్తున్నారు. ఇదే శాఖ పరిధిలోని ఇతర విభాగాల్లో హెచ్‌వోడీల వద్ద ఈ స్థాయిలో సిబ్బంది లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సిబ్బందికి అందే సేవల్లో పారదర్శకత కోసం ఫైళ్ల క్లియరెన్స్‌కు డెడ్‌లైన్ పెట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ శాఖలో అవినీతిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నట్టు తెలుస్తున్నది. కొంతమంది విజిలెన్స్ విభాగానికి సైతం లేఖలు రాసినట్టు సమాచారం.
అవినీతి ఉదంతాలు ఇవీ!