హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): ఆయిల్‌ఫెడ్‌లో ఇటీవల ఓ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్‌ను ఉన్నపళంగా తొలగించడం చర్చనీయాంశమైంది. సుదీర్ఘ కాలం నుంచి ఒక్కరే చేస్తున్నారనే కారణంతో తొలగించినప్పటికీ తెరవెనుక ఆయిల్‌ఫెడ్‌లో ఓ కీలక అధికారి కాసుల దందా ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీగలాగితే డొంక కదిలినట్టు 20 ఏండ్ల నుంచి లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకొచ్చిందనే చర్చ మొదలైంది. ఈ 20 ఏండ్లుగా సదరు అధికారే కీలక స్థానంలో కొనసాగుతున్నారు.
అలాంటప్పుడు మొన్నటి వరకు లేని తప్పు ఇప్పుడే ఎందుకు కనిపించిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. లెక్కల్లో తేడా రావడమే తొలగింపునకు కారణమనే చర్చ జరుగుతున్నది. కాంట్రాక్ట్‌ను కొనసాగించేందుకు సదరు అధికారి భారీ మొత్తంలో డిమాండ్ చేసిన ట్టు తెలిసింది. కాంట్రాక్టర్ మాత్రం అంత భారీ మొత్తం ఇచ్చుకోలేనని, ఎంతో కొంత సర్దుబాటు చేస్తానని చెప్పినట్టు సమాచారం. అంతే సదరు అధికారి .. సరే నీ సంగ తి చూస్తానంటూ బెదిరింపులకు దిగినట్టుగా తెలిసింది. ఇంకేమున్నది కాంట్రాక్టర్‌కు వ్యతిరేకంగా పావులు కదిపి తొలగించేలా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నాడు చైర్మన్… నేడు మంత్రి పేరు
సదరు కాంట్రాక్టర్ సుదీర్ఘ కాలం కొనసాగడం వెనుక ఆ అధికారి అండదండలు ఉన్నట్టుగా తెలిసింది. గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ కాంట్రాక్టర్‌ను తొలగించాలని ఆదేశించారు. అప్పుడు ఈ అధికారి కాంట్రాక్టర్‌ను కాపాడినట్టు సమాచారం. ఇప్పుడు లెక్కల్లో తేడా రావడంతో తొలగించేందుకు తెరవెనుక మంత్రాంగం నడిపినట్టుగా తెలిసింది. మళ్లీ ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి మంత్రి నోటనే చెప్పించి పని పూర్తి చేయించినట్టుగా సమాచారం. కాంట్రాక్టర్‌ను ఉన్నపళంగా బయటకు పంపించడం గమనార్హం.
కమీషన్ల ‘లెక్కల పుస్తకం’..
సదరు అధికారి… తన ఉద్యోగ కాలం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ కాంట్రాక్టర్లతో ఇంకా రాయబారాలు నడిపించడం మానలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కాంట్రాక్టర్ల కన్నా ఎక్కువగా సదరు అధికారే వెంటపడి మరీ బిల్లులు త్వరగా క్లియర్ అయ్యేలా చేస్తారని తెలిసింది. సదరు అధికారి ప్రత్యేకంగా లెక్కల పుస్తకాన్నే మెయింటెయిన్ చేస్తారని తెలిసింది. అటు బిల్లు క్ల్లియర్ కాగానే పుస్తకంలో లెక్కలు రాస్తారట. ఎవరికి ఎంత బిల్లు పడిందో లెక్కలేస్తారట. తర్వాత లెక్కల పుస్తకాన్ని ఓపెన్ చేసి ఫోన్లు చేస్తూ కమీషన్ల దందా మొదలుపెడుతారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు అధికారి పోరు భరించలేక.. ఆయన ఎప్పుడు వెళ్లిపోతారా అంటూ కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నట్టుగా తెలిసింది.