న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ రాబోతున్నది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూ.30,000 కోట్ల ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. శుక్రవారం సెబీ తమ వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్సేంజ్‌గా ఉన్న ఎన్ఎస్ఈ ఐపీవోకు మార్గం సుగమం చేస్తూ అబ్జర్వేషన్ లెటర్ జారీ అయ్యింది. దీంతో ఎన్ఎస్ఈ ఐపీవో వస్తే.. ప్రస్తుతం హ్యుందాయ్ మోటర్ ఇండియా పేరిట ఉన్న భారీ పబ్లిక్ ఇష్యూ (రూ.27,858.75 కోట్లు) రికార్డు చెరిగిపోనున్నది. ఇక ఈ ఐపీవోలో ఎన్ఎస్ఈ 14.89 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టబోతున్నది. వచ్చే వారం షేర్ల ధరల శ్రేణి, ఇతర వివరాలను ఎన్ఎస్ఈ వెల్లడించే వీలుందని సమాచారం. సెప్టెంబర్ 15న మొదలై 24-25 తేదీల్లో లిస్టింగ్ ఉండవచ్చు.
త్వరలో జియో ఐపీవో కూడా రాబోతున్నది. ఇప్పటికే సెబీ ఈ బాహుబలి పబ్లిక్ ఇష్యూకు సై అన్నది. జియో దాదాపు రూ.37,700 కోట్లను సమీకరించనున్నది. దీంతో ఎన్ఎస్ఈ ఐపీవో రెండో స్థానానికి పరిమితం కాకతప్పదు. ఇక 2016 నుంచి ఎన్ఎస్ఈ ఈ ఐపీవో కోసం ప్రయత్నిస్తుండగా.. అనేక కారణాలతో అది సాధ్యం కాలేదు. ఇప్పటికి సెబీ నుంచి అనుమతి వచ్చింది. సెబీకి ఎన్ఎస్ఈ దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) ప్రకారం.. ఈ ఐపీవోలో ఎస్బీఐ 2.48 కోట్లదాకా షేర్లను, ఎంఎస్ స్ట్రాటజిక్ (మారిషస్) లిమిటెడ్ 1.60 కోట్ల షేర్లను అమ్మేయనున్నాయి. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, బీవోబీ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్. జనరల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ తదితర కంపెనీలూ అమ్మనున్నాయి. అయితే ఎన్ఎస్ఈలో 10.72 శాతం వాటా ఉన్న ఎల్ఐసీ మాత్రం దూరంగా ఉండనున్నది. ఎస్బీఐకి 3.23 శాతం, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు 4.33 శాతం, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 4.44 శాతం వాటాలున్నాయి.
