శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:01

పాలమూరుకు కార్పొరేట్‌ వైద్యం

పాలమూరుకు కార్పొరేట్‌ వైద్యం

  • 50 ఎకరాల విస్తీర్ణం
  • 450 కోట్ల వ్యయం
  • స్వరాష్ట్రంలో తొలి వైద్యకళాశాల
  • ఉస్మానియా, గాంధీ తరహాలో నిర్వహణ
  • మహబూబ్‌నగర్‌లో సొంత ప్రాంగణంలో నిర్మాణం
  • ప్రకటించిన రెండున్నర ఏండ్లలో అందుబాటులోకి
  • మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నేడు ప్రారంభం
  • వెయ్యి పడకల అత్యాధునిక హాస్పిటల్‌కూ శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: స్వరాష్ట్రంలోనే తొలి మెడికల్‌ కళాశాల అయిన మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం దీనిని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాలమూరుకు మెడికల్‌ కళాశాల మంజూ రు చేయించడమే కాకుండా అత్యాధునిక భవనాలతో సొంత క్యాంపస్‌ను ఏర్పాటు చేయించారు. 50 ఎకరాల సువిశాల స్థలంలో 2015 నవంబర్‌లో రూ.450 కోట్లతో మెడికల్‌ కళాశాల భవన సముదాయ నిర్మాణాన్ని ప్రారంభించి.. రికార్డు స్థాయిలో కేవలం రెండున్నరేండ్లలో పూర్తి చేశారు. 2016-17లో కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటిబ్యాచ్‌ ప్రారంభం అయ్యిం ది. మూడేండ్లలోనే పీజీ కోర్సులు ప్రారంభం కావడం విశేషం. తెలంగాణ వస్తే ఏమొస్తదన్న వారికి ఈ కళాశాల ఓ సమాధానంగా నిలిచింది. 

అంతేకాదు ప్రస్తుతమున్న జిల్లా కేంద్ర జనరల్‌ దవాఖానను కూడా వైద్య కళాశాల ప్రాంగణంలోనే అత్యాధునికంగా వెయ్యి పడకలతో నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు సైతం మంజూరు చేసింది. మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాల నూతన ప్రాంగణాన్ని ప్రారంభించడంతోపాటు అక్కడే జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనితోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరిట ఏర్పాటు చేయనున్న దేశంలోనే అతిపెద్ద ఎకోఅర్బన్‌ పార్కుకు మంత్రి భూమిపూజ చేయనున్నారు.

ఆధునిక వసతులు..

2016-17 ఏడాది నుంచి మెడికల్‌ కళాశాల పరిధిలో ఎంబీబీఎస్‌ మొదటి బ్యాచ్‌ 150 మంది విద్యార్థులతో ప్రారంభమయ్యింది. గత ఏడాది ఈక్యూఎస్‌ కోటా పరిధిలో సీట్లు పెంచ డం వల్ల సీట్ల సంఖ్య 175కు పెరిగింది. ప్రస్తు తం 5వ బ్యాచ్‌కు ఎంసీఐ నుంచి అనుమతి ఖరారు కాబోతున్నదని అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు ప్రస్తుతం ఉన్న 175 సీట్లు వచ్చే ఏడాది నుంచి 200కు పెరగనున్నాయి. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌కు సంబంధించి 14పీజీ సీట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నా యి. వైద్య కళాశాలకు అనుబంధంగా పారామెడికల్‌ కళాశాల సైతం ప్రారంభమైంది. డీఎంఎల్‌టీ, డయాలసిస్‌ టెక్నీషియన్‌ కోర్సులు కొనసాగుతున్నాయి. త్వరలో నర్సింగ్‌, ఫార్మసీ, ఫిజియోథెరపీ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు సాగుతున్నది. 

దీంతోపాటు కళాశాలలో మోడల్‌ గ్రామీణ ఆరోగ్య పరిశోధన యూనిట్‌ (ఎంఆర్‌హెచ్‌ఆర్‌యూ)మంజూరు అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య, సాంకేతిక అంశాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఒక్కటి మాత్రమే కేటాయిస్తుంది. దీంతో జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరిగే వైద్య ఆరోగ్య పరిశోధనలను గ్రామీణ ప్రజలకు చేరువ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్య పరిశోధనకు కావాల్సిన శిక్షణ ఇచ్చి వ్యవస్థను బలోపేతం చేసి జాతీయ స్థాయికి అనుసంధానం చేయడానికి వీలవుతుంది. 


అతి పెద్ద అర్బన్‌ ఎకోపార్కుకు శంకుస్థాపన

దేశంలోనే అతి పెద్ద ఎకో అర్బన్‌ పార్కును మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరిట ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని మయూరీ పార్కు సమీపంలోని అప్పన్నపల్లి రిజర్వ్‌ ఫారెస్టులో 2087 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న అర్బన్‌ పార్కుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు పెడుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. పాలమూరుకే మణిహారంగా ఈ పార్కు ఉండబోతున్నదని చెప్పారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని వీరన్నపేటలో 660 డబుల్‌ బెడ్రూం ఇండ్లు, కలెక్టరేట్‌ వద్ద ఎక్స్‌పో ప్లాజా ప్రారంభోత్సవ కార్యక్రమాల్లోనూ కేటీఆర్‌ పాల్గొననున్నారు. పట్టణంలోని వైట్‌హౌజ్‌ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన రుణమేళాలో చిరు వ్యాపారులకు రూ. 130 కోట్ల రుణాలను అందించనున్నారు. 

సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు

తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నవారికి పాలమూరు వైద్య కళాశాల ఓ సమాధానం. రాష్ట్రం ఏర్పాటుకు ముందు అత్యాధునిక వైద్య సేవలు లేక రోగులను హైదరాబాద్‌ తీసుకుపోయేలోపే దారిలోనే చనిపోయిన సంఘటనలెన్నో ఉన్నాయి. పాలమూరులో వైద్యం అందక పక్క రాష్ట్రంలోని కర్నూలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చేది. సీఎం కేసీఆర్‌ను అడిగిన వెంటనే వైద్య కళాశాలను మంజూరు చేశారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచే తరగతులు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 50 ఎకరాల సువిశాల స్థలంలో ఈ కళాశాల ప్రాంగణాన్ని నిర్మించాం. అంతేగాక అత్యాధునిక జనరల్‌ దవాఖానను సైతం మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. 

- వీ శ్రీనివాస్‌గౌడ్‌, ఎక్సైజ్‌శాఖ మంత్రి


logo