Hyderabad | హైకోర్టు అడ్వకేట్ రామ రాజశేఖర్‌రెడ్డికి ఇద్దరు సంతానం.. సర్కారు బడుల్లో సకల సౌకర్యాలతోపాటు ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన సాగుతుండటంతో ఆయన తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఆయన పెద్ద కుమారుడు సంకేత్‌రెడ్డి మణికొండ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివి పదో తరగతిలో 9.0 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాడు. జాతీయ చెస్ క్రీడాకారుడిగా రాణిస్తున్నాడు. రెండో కుమారుడు సహస్‌రెడ్డి ప్రస్తుతం ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. తమ అపార్ట్మెంట్ వాచ్మెన్ కొడుకు, తాను ఒకే స్కూల్లో చదువుతున్నట్టు ఆయన వివరించాడు.
సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి కుమారుడు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడు. అయితే, సర్కారు బడుల్లో ఉత్తమ ఫలితాలు రావడం, కార్పొరేట్ హంగులతో సౌకర్యాలు కల్పించడం.. ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన సాగుతుండటంతో ఆయన తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు. ఇలా ఎంతోమంది సర్కారు బడి వైపు పరుగులు తీస్తున్నారు. సీఎం కేసీఆర్ చొరవతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారడంతో తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం సిఫారసులు చేస్తున్నారు.
Narsingi School
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మహానగరం.. అందున ఐటీ కారిడార్.. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఐటీ కంపెనీలు కొలువుదీరిన ప్రాంతం.. అక్కడ నివసించేవారికి డబ్బులకు కొదువ లేదు. తమ పిల్లలను లక్షలు పెట్టి కార్పొరేట్ స్కూళ్లలో చదివించే స్థోమత వారికున్నది. కానీ, వారి దృష్టి ఇప్పుడు సర్కార్బడులపై పడింది. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు బోధిస్తుండటం.. ఇంగ్లిష్ మీడియం, ‘మన ఊరు- మన బడి’తో బడుల్లో సకల సౌకర్యాలు ఒనగూరడం.. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫారాలు అందించడం.. మధ్యాహ్న భోజనం సమకూరుస్తుండటంతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కారు బడులకు వలసలు పెరిగాయి. దీంతో ఐటీ కారిడార్‌లోని జనం సర్కార్ బడులకు క్యూ కడుతున్నారు.
ఐటీ కారిడార్‌లోని పలు బడుల్లో ఆరు నుంచి పది తరగతులు అంటే 5 తరగతుల్లోనే వెయ్యికి పైగా విద్యార్థులున్నారు. ప్రైమరీ స్కూల్స్ 500కు పైగా విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, గండిపేట మండలాల్లోని బడుల్లో అడ్మిషన్ల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. సీట్ల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి తల్లిదండ్రులు సిఫారసులు తీసుకొస్తున్నారు. హెచ్ఎంలు అడ్మిషన్ల తాకిడిని తట్టుకోలేక స్క్రీనింగ్, బేస్‌లైన్ టెస్టులను నిర్వహిస్తున్నారు. బడిబాట ఎన్రోల్మెంట్ డ్రైవ్ ముగిసినా.. అడ్మిషన్ల కోసం వినతులు వస్తున్నాయి. శేరిలింగంపల్లి మండలంలోనే 47 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 12 జెడ్పీ హైస్కూళ్లున్నాయి. మొత్తం 59 స్కూళ్లుండగా.. వీటిలో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో మరో 40 వరకు స్కూళ్లుండగా.. వీటిలో ప్రవేశాలకు పోటీ నెలకొన్నది.
మణికొండ.. చదువులకు అండ
మణికొండలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం కొత్తగా 331 విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీరిలో 40 మంది ప్రైవేట్‌స్కూళ్ల నుంచి వచ్చినవారే.. 2015లో ఈ స్కూల్లో అడ్మిషన్ల సంఖ్య 550 మాత్రమే. ఇప్పుడి ఈ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 1,292కు చేరింది. ఏడేండ్లు తిరిగే వరకు అడ్మిషన్లు డబుల్ అయ్యాయి. సీట్లు లేవని చెబుతున్నా.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఇక్కడ 6 నుంచి10వ తరగతి వరకు ఒక్కో తరగతికి మూడు సెక్షన్లు నిర్వహిస్తున్నారు. గతంలో ప్రాథమిక పాఠశాల జెడ్పీ స్కూల్లోనే నిర్వహించగా, గదులు సరిపోకపోవడంతో ప్రైమరీస్కూల్ను మరోచోటికి తరలించారు. 1.35 ఎకరాల స్థలాన్ని కేటాయించి 15 గదులతో ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
గచ్చిబౌలిలో అడ్మిషన్లకు సిఫారసులు
Gachibowli School
గచ్చిబౌలిలోని జెడ్పీ ఉన్నతపాఠశాలలో అడ్మిషన్ల కోసం ఎమ్మెల్యే నుంచి సిఫారసులొస్తున్నాయి. తల్లిదండ్రులు నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఎమ్మెల్యే ఫోన్ చేసి సీటు ఇవ్వాలని కోరాల్సిన పరిస్థితి. ఈ పాఠశాల 300 మంది విద్యార్థులకే సరిపోతుంది. ఈ ఏడాది 210 మంది చేరడంతో విద్యార్థుల సంఖ్య 624కు చేరుకున్నది. దీంట్లో 70 శాతం బాలికలే. ఈ పాఠశాలకు ఇటీవలే నాలుగు అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. 2009లో ఈ స్కూల్లో విద్యార్థుల సంఖ్య 137 మాత్రమే ఉండగా, ఇప్పుడు నాలుగింతల అడ్మిషన్లు పెరిగాయి. ఇదే ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలలో మరో 600 మంది విద్యార్థులున్నారు. 8 తరగతి గదుల్లో డిజిటల్ విద్యాబోధన కొనసాగుతున్నది. స్టెమ్ల్యాబ్ను ఏర్పాటు చేశారు. పాఠశాల భవనంపై 5కేవీ సోలార్‌ప్లాంట్‌ను ఏర్పాటుచేయడంతో విద్యుత్తు బిల్లులు గణనీయంగా తగ్గాయి. ప్రముఖ ఐటీ కంపెనీ సయెంట్ సంస్థ ఈ స్కూల్‌ను దత్తత తీసుకుని నెలకు రూ.2 లక్షల వరకు వెచ్చిస్తున్నది.
నార్సింగి స్కూల్ నయా రికార్డు
ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉన్న నార్సింగి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2015లో అడ్మిషన్ల సంఖ్య 320 మాత్రమే. కానిప్పుడు 779 మంది విద్యార్థులున్నారు. పదో తరగతిలో 177 మంది, 9వ తరగతిలో 152, 8వ తరగతిలో 188, 7వ తరగతిలో 177 విద్యార్థులున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, స్టెమ్ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ వంటి అధునాతన సౌకర్యాలున్న ఈ స్కూల్లో చేరేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ ఏడాది 201 మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందారు. అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుండటంతో ఇటీవలే 6 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. తరగతికి మూడు సెక్షన్లు నిర్వహిస్తుండగా.. రెండు ఇంగ్లిష్ మీడియం సెక్షన్లు నడుస్తున్నాయి. గతంలో ఈ స్కూల్లో పదో తరగతి ఫలితాలు 30 శాతం నమోదు కాగా.. 2023లో 79 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 10 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ బాసరలో సీట్లు సాధించారు.
డిసెంబర్ దాకా అడ్మిషన్ల కోసం వస్తుంటారు
నేను 8 ఏండ్లుగా మణికొండ స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నా. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి కార్పొరేట్ పాఠశాలలున్నా.. మా స్కూల్లో డిమాండ్ అధికంగా ఉంది. స్కూళ్లు ప్రారంభమై రెండు నెలలు గడిచినా అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు వస్తూనే ఉన్నారు. ఇలా డిసెంబర్ దాకా అడ్మిషన్ల కోసం వస్తుంటారు. తల్లిదండ్రుల పరిస్థితి చూసి కాదనలేక సీట్లు ఇస్తున్నాం.
– నిరంజన్, హెచ్ఎం మణికొండ
కరోనా తర్వాత అడ్మిషన్లు ఊపందుకున్నాయి
కరోనా తర్వాత మా స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. మంచి ఫలితాలు సాధించడంతో అడ్మిషన్ల కోసం సిఫారసులు వస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. పదో తరగతిలో డివిజన్లో మా స్కూలే టాప్‌లో నిలిచింది. పిల్లలకు ఫ్యూరిఫైడ్ నీళ్లను అందజేస్తున్నాం. పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్‌ను సమకూర్చడం మా స్కూల్ నుంచే ప్రారంభమైంది.
– పీ వెంకటేశ్వర్రావు, జెడ్పీ ఉన్నత పాఠశాల గచ్చిబౌలి ప్రధానోపాధ్యాయుడు
మా బాబుకు సీటు కోసం వచ్చా
మా బాబు స్టీఫెన్‌ను ఇది వరకు మెస్కో అనే ప్రైవేట్ స్కూళ్లో చదివించా. ఇప్పుడు 6వ తరగతికి వచ్చాడు. ఫీజులు కట్టే స్థోమత లేకపోవడంతో బడి మాన్పించాల్సి వచ్చింది. రెండు నెలలుగా బడికెళ్లడం లేదు. సర్కారు బడుల్లోనూ ఇంగ్లిష్ మీడియం బోధిస్తుండటంతో మా బాబుకు సీటు కోసం నార్సింగి జెడ్పీ స్కూల్‌కు వచ్చాను. ఈ స్కూళ్లో సీట్లు లేవని చెప్పినా.. నా పరిస్థితి చెప్పి ప్రాధేయపడటంతో సీటు ఇస్తామన్నారు.
– రూప, విద్యార్థి తల్లి
ప్రభుత్వ చొరవ అభినందనీయం
ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయం. ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో బడులు కార్పొరేట్ లుక్‌ను సంతరించుకున్నాయి.
-ఎం చెన్నయ్య, హిమాయత్‌నగర్
నేను చదువుకున్నది సర్కారు స్కూళ్లోనే..
నేను సర్కారు స్కూళ్లో చదువుకుని ఓ సంస్థకు అధిపతిగా ఎదిగాను. నా ఇద్దరు పిల్లలను నార్సింగిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలో చేర్పించా. ప్రైవేట్ స్కూళ్లో ఉన్నప్పుడు మా పిల్లలు బట్టీ పట్టేవారు. నార్సింగి జెడ్పీ స్కూల్లో చేర్పించిన తర్వాత వారిలో ఎంతో మార్పు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి వసతులున్నాయి. క్వాలిఫైడ్ టీచర్లున్నారు.
– కృష్ణ, విద్యార్థి తండ్రి
School6