సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 10:43:40

ప్రారంభమైన కరోనా టీకా డ్రైరన్‌

ప్రారంభమైన కరోనా టీకా డ్రైరన్‌

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్ కొనసాగుతున్నది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఏడు కేంద్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన, నాంపల్లి ఏరియా దవాఖాన, తిలక్‌నగర్‌ యూపీహెలో, సోమాజిగూడ యశోద హాస్పిటల్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జానంపేట పీహెచ్‌సీ, మహబూబ్‌నగర్‌ జీజీహెచ్‌, నేహా షైన్‌ హాస్పిటల్‌లో డ్రైరన్‌ కొనసాగుతున్నది. ఒక్కో కేంద్రంలో 25 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. 

టీకా ఇచ్చే సమయంలో క్షేత్రస్థాయి సమస్యలను అధికారులు పరిశీలిస్తారు. కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారికి వ్యాక్సినేషన్ ఇస్తారు‌. పోర్టల్‌ ధ్రువపత్రాలు సరిపోల్చుకుని టీకా ఇస్తారు. కరోనా టీకా తీసుకున్న తర్వాత అరగంట సేపు వ్యాక్సిన్‌ కేంద్రంలోనే వ్యాక్సినేటర్లు ఉండాల్సి ఉంటుంది. టీకా ఇచ్చిన తర్వాత శరీరంలో మార్పులను అధికారులు గుర్తిస్తారు. ఇలా శరీరంలో వచ్చే మార్పులను కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేస్తారు. 

దేశంలోని 116 జిల్లాల్లో

దేశంలోని మొత్తం 116 జిల్లాల్లో 259 ప్రదేశాల్లో ఈ డ్రైరన్‌ను నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాటుచేసే వ్యవస్థల పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. కొవిన్‌ పోర్టల్‌ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు డ్రైరన్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి నిమిషం క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేస్తారు. అన్ని రాష్ట్రాల్లో కనీసం మూడు ప్రదేశాల్లో డ్రైరన్‌ కార్యక్రమం చేపట్టారు. కేరళ, మహారాష్ట్ర మినహా మిగిన రాష్ట్రాల రాజధానులు, సమీప ప్రదేశాల్లో డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో మూడు ప్రధాన పట్టణాల్లో డ్రైరన్‌ను నిర్వహిస్తున్నారు. డ్రైరన్‌ జరిగే ప్రాంతాల్లో బ్లాక్‌ లెవల్‌ టాస్క్‌ఫోర్క్‌తో పర్యవేక్షించనున్నారు. 


సంతృప్తి వ్యక్తం చేసిన హర్షవర్ధన్‌

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ఢిల్లీలోని జీటీబీ దవాఖానలో డ్రైరన్‌ ప్రక్రియను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. టీకా భద్రత, సామర్థ్యాన్ని నిర్ధారించడం తమ ప్రాధాన్యత అని చెప్పారు. పోలియో టీకా సమయంలో వివిధ రకాల పుకార్లు వ్యాపించాయి. కానీ ప్రజలు టీకా తీసుకున్నారు. దీంతో భారత్‌ ఇప్పుడు పోలియో రహిత దేశంగా మారిందని చెప్పారు.    

గత నెల 28న పంజాబ్‌, గుజరాత్‌, అసోం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో డ్రైరన్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈ సారి అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్‌ను నిర్వహిస్తున్నారు.  


logo