ఖైరతాబాద్, మార్చి 16: కరోనా ఇక లేదని కొందరు అనుకొంటున్నారని కానీ వైరస్ ప్రభావం తగ్గింది తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు హెచ్చరించారు. థర్డ్‌వేవ్‌లో కరోనా ప్రభావం చూపలేదు కాబట్టి వ్యాక్సిన్ అవసరం లేదన్న నిర్లక్ష్య ధోరణి వద్దని చెప్పారు. అమెరికా, హాంకాంగ్, చైనాలో కొత్త కేసులు నమోదవుతున్నట్టు వార్తలు వస్తున్నాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నదని తెలిపారు. ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పారు. ఖైరతాబాద్‌లో ఏర్పాటుచేసిన 50 పడకల ప్రభుత్వ దవాఖానను మంత్రి బుధవారం ప్రారంభించారు. అనంతరం జాతీయ టీకా దినోత్సవాన్ని పురస్కరించుకొని 12-14 సంవత్సరాల పిల్లలకు రాష్ట్రవ్యాప్త వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో ప్రపంచదేశాలకు వ్యాక్సిన్ అందజేస్తున్న ఘనత తెలంగాణకు దక్కుతున్నదని అన్నారు. కొత్త వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు హైదరాబాద్ వైపే చూస్తున్నాయని చెప్పారు. దేశంలో మూడు వ్యాక్సిన్లు వస్తే వాటిలో రెండు హైదరాబాద్ నుంచి రావడం గర్వకారణమని అన్నారు. అందులో మొదటిది భారత్ బయోటెక్ నుంచి, రెండోది బయోలాజికల్ ఈ లిమిటెడ్ నుంచి వచ్చిందని గుర్తుచేశారు. తాజాగా 12-14 ఏండ్లలోపు పిల్లల కోసం కార్బివ్యాక్స్ వ్యాక్సిన్‌ను బయోలాజికల్-ఈ సంస్థ అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు. ఇందుకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్లకు ప్రత్యేక అభినందలు తెలిపారు. కరోనా కట్టడిలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బంది చాలా బాగా పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5.94 కోట్ల టీకా డోసులు వేశామని తెలిపారు. 12-14 ఏండ్ల లోపు వారు రాష్ట్రంలో 17లక్షల మంది ఉంటారని అంచనా వేశామని అన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
రాష్ట్రంలో వైద్యులు, వైద్య సిబ్బందికి కొరత ఉన్నట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల తాను మలక్‌పేట దవాఖానలో అకస్మిక తనిఖీలు నిర్వహించినప్పుడు 42 మంది డాక్టర్లు, 30 మంది పేషెంట్లు ఉన్నారని, ఇంకా కొరత ఉందంటూ లేనిపోని ప్రచారం చేయవద్దని చెప్పారు. సిబ్బందిలో ఈహెచ్ఎస్, వైద్య విధాన పరిషత్, మెడికల్ ఎడ్యుకేషన్ అనే భేదాభిప్రాయాలు వద్దని, కలిసి కట్టుగా పనిచేయాలని అన్నారు. సెకండ్‌ఫ్లోర్‌లో ఉన్నాం.. థర్డ్కు పోము, థర్డ్‌లో ఉన్న వారు ఫోర్త్ ఫ్లోర్‌కు పోమని చెప్పొద్దని అన్నారు. అలాంటి ఆలోచనలో ఎవరైనా ఉంటే భద్రాచలం, ఆసిఫాబాద్‌లో ఖాళీలు ఉన్నాయని, అక్కడికి పంపి వారి సేవలను వినియోగించుకుంటామని హెచ్చరించారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనం కోసం స్థలాన్ని అందిస్తే నిధులు ఎంతైనా మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్ పీ విజయారెడ్డి, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కే ప్రసన్న రామ్మూర్తి, వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వెంకటి, బయలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్ల, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఏ సునీత, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకళ, ఖైరతాబాద్ ప్రభుత్వ దవాఖాన ఇన్చార్జి వైద్యురాలు డాక్టర్ కల్యాణి, ఎస్పీహెచ్వో డాక్టర్ నాగేంద్ర, ఖైరతాబాద్ యూపీహెచ్సీ డాక్టర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
బూస్టర్ డోస్‌కు అనుమతి
ఆరవై ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని గతంలో కేంద్రానికి లేఖ రాశామని, నేడు అంగీకరించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గతంలో వైరస్ తీవ్రత ఉన్నప్పుడు లైన్లు కట్టారని, అప్పుడు వ్యాక్సిన్ కొరత ఉండేదని, ఇప్పుడు కావాల్సినన్ని డోసులు ఉన్నాయని, కానీ ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నదని అన్నారు. టీకా తీసుకున్న వారితో పాటు వారి కుటుంబం, రాష్ట్రం మొత్తం సురక్షితంగా ఉంటుందని చెప్పారు. గతంలో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు అద్భుతంగా పనిచేశారని, వారు అదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజారోగ్యం బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానల్లో సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
మంత్రి హరీశ్‌ను సత్కరించిన డిక్కీ
వైద్యారోగ్య శాఖ పరిధిలోని డైట్ ఎజెన్సీలు, భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఏజెన్సీల్లో దళితులకు 16% కేటాయించడంపై దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు డిక్కీ ప్రతినిధులు బుధవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. దళితులకు 16% కోటా కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్న సీఎం కేసీఆర్‌కు, సహకరించిన మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. మంత్రి హరీశ్‌ను సత్కరించిన వారిలో డిక్కీ జాతీయ అధ్యక్షుడు నర్ర రవికుమార్, వైస్ ప్రెసిడెంట్ మునిధర్, నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ హెడ్ సురేశ్ నాయక్, స్టేట్ హాస్పిటాలిటీ హెడ్ సీతారామ్, స్టేట్ ట్రైబల్ హెడ్ శ్రీరామ్ ఆనంద్ తదితరులు ఉన్నారు.