హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ 48,168 ఉత్పరివర్తనాలు చెందినట్టు సీసీఎంబీ బయో ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 45,871 శాంపిళ్ల జన్యుక్రమాన్ని విశ్లేషించి, ఈ విషయాన్ని నిర్ధారించారు. దేశంలోని 35 ల్యాబ్‌లు జన్యుక్రమ విశ్లేషణలో పాలుపంచుకున్నాయి. అయితే ఈ వైరస్ ఎన్ని ఉత్పరివర్తనాలు చెందినప్పటికీ ప్రమాదకరమైనవి స్వల్పంగానే ఉన్నట్టు గుర్తించారు. నూటికి 99 ఉత్పరివర్తనాలలో వైరస్ బలహీనపడుతున్నది. ఒక్కశాతమే బలమైన ఉత్పరివర్తనం (వేరియంట్)గా మారుతున్నది. డెల్టా, కప్పా, ఆల్ఫా, టీటా, బీటా, గామా, డెల్టాప్లస్ వంటివి బలమైన మ్యుటేషన్‌కు ఉదాహరణలు.
అత్యధికంగా డెల్టానే..
మనదేశంలో సెకండ్‌వేవ్‌కు కారణమైన డెల్టా (మహారాష్ట్ర వేరియంట్-2)ను అత్యధిక శాంపిళ్లలో గుర్తించారు. 18,539 శాంపిళ్లలో దీని ఆనవాళ్లు కన్పించాయి. డెల్టాను తొలుత 2020 సెప్టెంబర్‌లో గుర్తించినప్పటికీ, 2021 ఫిబ్రవరి నుంచి విజృంభించింది. అప్పటినుంచి దేశవ్యాప్తంగా డెల్టా కేసులే అత్యధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో నమోదవుతున్న దాదాపు 90 పైగా కేసులు డెల్టావే. దీనికంటే బలమైన వేరియంట్‌గా డెల్టాప్లస్ అవతరిస్తుందని పలువురు అంచనావేశారు. ఇది మూడో వేవ్‌కు కారణమవుతుందని హెచ్చరించారు. అయితే ఇది డెల్టా కంటే బలహీనమైనది కావడంతో పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రస్తుతం డెల్టాను మించిన వేరియంట్ ప్రపంచంలో ఎక్కడా లేకపోవడం, మనదేశంలో ఇప్పటికే రెండోవేవ్ గరిష్ఠస్థాయికి వెళ్లి, తగ్గినందున మూడోవేవ్ ఇప్పట్లో రాకపోవచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు.