మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 01:36:26

తెలంగాణలో జేసీబీతో కరోనా మృతుడి తరలింపు అబద్ధం

తెలంగాణలో  జేసీబీతో కరోనా మృతుడి తరలింపు అబద్ధం

తెలంగాణలో కరోనాతో చనిపోయిన వ్యక్తి శవాన్ని జేసీబీతో శ్మశానవాటికకు తరలించారంటూ మంగళవారం సోషల్‌ మీడియాలో ఒక ఫొటో వైరల్‌ అయ్యింది. ఇది వాస్తవం కాదు. తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు ఈ ఫొటోను వాడుకున్నారు. నిజానికి ఈ ఫొటోలోని దృశ్యం ఏపీలోని తిరుపతి పట్టణానికి చెందినది. కొవిడ్‌-19 సోకిన ఒక వ్యక్తి శ్రీవేంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(స్విమ్స్‌)లో చికిత్స పొందుతూ గత ఆదివారం మృతి చెందాడు. అతడి కుటుంబసభ్యులు శవాన్ని తిరుపతిలోని గోవిందధామంలోని ఎలక్ట్రికల్‌ దహన వాటికకు అంబులెన్స్‌లో తీసుకువెళ్లారు. మృతుడు 175 కిలోల బరువు ఉండటంతో ఎలక్ట్రికల్‌ దహన వాటికలో శవం పట్టలేదు.

దీంతో శవాన్ని అంబులెన్స్‌లో హరిశ్చంద్ర ఘాట్‌కు తీసుకువెళ్లారు. అప్పటికే అక్కడ 14 అడుగుల మేర గుంత కూడా తవ్వారు. అయితే వాహనం నుంచి గుంత ఐదారు మీటర్ల దూరం ఉండటంతో అక్కడి వరకు మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నలుగురైదుగురు వ్యక్తులు కూడా తీసుకుపోయే పరిస్థితి లేనందున జేసీబీని వినియోగించారు. ఇందుకు మున్సిపల్‌ కమిషనర్‌ పీఎస్‌ గిరీషా మృతుడి కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత మున్సిపల్‌ కమిషనర్‌ ఈ అంశంపై మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వివరించారు.

- హైదరాబాద్‌, నమస్తే తెలంగాణlogo