Corning Inc | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు విదేశీ కంపెనీలు క్యూకడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ ఇక్కడ పెట్టుబడులు పెట్టగా.. తాజాగా మెటీరియల్ స్సెన్సెస్లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఓకే చెప్పింది. న్యూయార్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణలో గొరిల్లా గ్లాసు తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం తెలంగాణలో రూ.934 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో భాగంగా కార్నింగ్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు జాన్ బేన్, గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ రవికుమార్, ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ సారా కార్ట్‌మెల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ ఎకో సిస్టం తెలంగాణలో బలోపేతమైన తీరు, ఇందుకోసం తెలంగాణ సర్కారు తొమ్మిదేండ్లలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా అనేక ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, మరికొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను విస్తృతపరుస్తున్న విషయాన్ని తెలియజేశారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్‌కాన్ కూడా భారీస్థాయిలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని, ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ పాలసీలపై కురిపించిన ప్రశంసలను ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కేటీఆర్ చొరవతోనే
తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలతలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అనుబంధ తయారీరంగ పెట్టుబడుల కోసం తెలంగాణ సర్కారు చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ర్టాన్ని తమ ఉత్పత్తి ప్లాంట్‌కు కేంద్రంగా ఎంచుకొన్నట్టు కార్నింగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. వివిధ అంతర్జాతీయ నగరాలను తమ పెట్టుబడి కోసం పరిశీలించి హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు నిర్ణ యం తీసుకొన్నట్టు వెల్లడించారు. తమ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చే విషయంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఐటీ, పరిశ్రమల శాఖ నిరంతరం తమతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని, ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఐటీ అనుబంధ రంగాల మాదిరిగానే ఎలక్ట్రానిక్స్ తయారీ విషయంలోనూ వేగంగా ముందుకుపోతున్న తీరు తమ దృష్టిలో ఉన్నదని, ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా ఈ పెట్టుబడి ద్వారా తమ తయారీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్టు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
తెలంగాణ పాలసీలకు దిగ్గజ కంపెనీలు ఫిదా: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర పాలసీలు నచ్చే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ సర్కారు ప్రయత్నాలు ఫలించి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఫాక్స్‌కాన్ వంటి దిగ్గజ సంస్థలతోపాటు అనేక అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. మెటీరియల్ సైన్సెస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ తెలంగాణలో రూ. 934 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకురావడం చాలా ఆనందంగా ఉన్నదని చెప్పారు. ఈ స్మార్ట్ఫోన్ల గొరిల్లా గ్లాస్ తయారీ కంపెనీ ద్వారా దాదాపు 800 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇది వ్యూహాత్మక పెట్టుబడి అని మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. హైదరాబాద్ కేంద్రంగా తన తయారీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న కార్నింగ్ సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సంస్థ కార్యకలాపాల ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ప్రకటించారు. కేటీఆర్ వెంట తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపురి తదితరులు ఉన్నారు.
‘కార్నింగ్’ ప్రత్యేకతలు