హైదరాబాద్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : గన్నీ సంచులు లేవు.. లారీలు లేవు.. కొనుగోలు కేంద్రాలు లేవు.. ఉన్నచోట ప్రయోజనంలేదు.. కొనుగోలు చేసిన మక్కలు పెట్టేందుకు గోదాముల్లేవు.. గన్నీ సంచుల కోసం రాత్రీపగలు తేడా లేకుండా పడిగాపులు.. పీఏసీఎస్ కేంద్రాల వద్దే జాగరణ.. మక్కలు తెచ్చి 20 రోజులైనా కాంటా పెట్టే దిక్కులేదు.. కొనుగోలు చేసే నాథుడులేడు.. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా మక్కరైతుల గోస! మక్కల కొనుగోలుపై సర్కార్ చేతులెత్తేయడంతో అమ్ముకొనేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు.. వాటిలో కాంటా పెట్టి గన్నీ సంచి నింపితే ఒట్టు అని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మక్కలు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా.. కొనుగోలు చేసే దిక్కులేదని మండిపడుతున్నారు.
గన్నీల కొరత కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరుపీఏసీఎస్ వద్ద రైతులు గన్నీల కోసం రాత్రంతా అక్కడే నిద్రపోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. గన్నీల కొరత ఉండటంతో రైతులకు కూపన్లు పంపిణీ చేస్తున్నారు. యాసంగిలో 30 లక్షల టన్నుల మక్కలు ఉత్పత్తి అవుతాయనే అంచనా వేశారు.14 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 2.8 కోట్ల టన్నుల గన్నీ సంచులు అవసరం. 10 లక్షల టన్నుల మక్కలు కొనుగోలు చేయాలన్నా.. 2 కోట్ల గన్నీలు కావాల్సి ఉండగా అధికారులు 70 లక్షలు మాత్రమే సమకూర్చారు. అధికారులు, టెండర్‌దారుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో గన్నీ బ్యాగుల సరఫరాను నిలిపివేసినట్టు తెలిసింది. దీనికితోడు లారీలు, గోదాముల కొరత వెంటాడుతున్నది. కొనుగోలు చేసిన మక్కల్ని తీసుకెళ్లేందుకు లారీలు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. 20 రోజులు దాటినా మక్కలను తరలించకపోవడంతో విక్రయించిన రైతులు కాపలాగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మక్కలను నిల్వ చేయడానికి అవసరమైన గోదాములు అందుబాటులో లేక కేంద్రాల్లోనే ఉంచుతున్నారని సమాచారం.
ప్రైవేట్ మార్కెట్లో ధరలేదు.. మరోవైపు సర్కార్ చేతులెత్తేసిన పరిస్థితి. తొలినుంచీ మక్కలు కొనుగోలు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందనే వాదనను ప్రభుత్వ పెద్దలు వ్యక్తంచేసినట్టు తెలిసింది. రైతులు ఆందోళనలు చేయడం, రోడ్డెక్కడంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలుకు సిద్ధమైందనే అభిప్రాయాలున్నాయి. కోతలు, కొర్రీలతో మక్కల కొనుగోలును వీలైనంత తగ్గించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నదనే చర్చ జరుగుతున్నది. ఇప్పటివరకు మూడు లక్షల టన్నులు మాత్రమే సర్కార్ కొనుగోలు చేసినట్టు తెలిసింది. దీంతో క్వింటాల్‌కు రూ.వెయ్యి నష్టం వస్తున్నా ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మద్దతు ధర రూ.2,400 ఉండగా మార్కెట్లో రూ.1,500 మాత్రమే ధర పలుకుతున్నది.
రైతులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పత్తాలేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కొనుగోళ్లు లేక, మద్దతు ధర దక్కక మక్క రైతులు గోస పడుతున్నా, కనీసం కేంద్రాల వద్దకు వెళ్లి రైతులకు ధైర్యం చెప్పే దిక్కులేదనే విమర్శలున్నాయి. హనుమకొండ జిల్లా గూడెప్పాడ్ మార్కెట్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా కొనుగోళ్లు కొనసాగడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టి కేంద్రాలను ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు ఆ తరువాత పత్తాలేకుండాపోతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మక్కజొన్న రైతులు కన్నెర్ర చేశారు. కొనుగోలు చేపట్టడం లేదంటూ రైతులు మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జాతీయ రహదారిపై బైఠాయించారు. 20 రోజుల కిందట మక్కను మార్కెట్‌కు తీసుకొచ్చినా కొనడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బస్తాలు లేవని, లారీలు రావడం లేదని సాకులు చెప్తూ రోజులు వెళ్లదీస్తున్నారన్నారు.

మార్కెట్లోనే మక్క కుప్పల వద్ద రాత్రింబవళు పడిగాపులు కాయాల్సి వస్తుందన్నారు. వీరి ఆందోళనలకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ధర్నాతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. తహసీల్దార్ నర్సింగరావు, పీఏసీఎస్ సీఈవో యాదగిరి, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. కొనుగోలు చేసే దాక ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు భీష్మించారు. అధికారుల హామీ మేరకు ఆందోళన విరమించారు.
అకాల వర్షం రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చింది. మంగళవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక్కసారిగా గాలి దుమారం.. ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఉంచిన మక్క తడిసిపోయింది. వర్షపు నీటిలో కొట్టుకుపోతుంటే కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లుపడ్డారు.

మక్కల రాసులపై కప్పిన కవర్లుసైతం గాలికి ఎగిరిపోయాయి. కొందరు రైతులు అక్కడే కవర్లను గట్టిగా పట్టుకొని వానలో తడుస్తూ ఉండిపోయారు. మక్కల చుట్టూ వర్షపు నీరు కాలువలో పారుతుంటే రైతుల గుండె తరుక్కుపోయింది.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన మక్కజొన్న కొనుగోళ్లు అర్ధ్ధాంతరంగా నిలిచిపోయాయి. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400తో ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా.. ప్రైవేట్ వ్యాపారులు రూ.1,800కే తీసుకుంటున్నారు.

కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ యార్డుల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడంతో రైతులు మండుటెండలో ఇబ్బందులు పడుతున్నారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 1,02,620 ఎకరాల్లో మక్క సాగైంది. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి చొప్పున 3.59 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.

ప్రభుత్వ కేంద్రాల్లో ఎకరానికి 26.50 క్వింటాళ్లు మాత్రమే తూకం వేస్తామని అధికారులు పేర్కొనడంతో చేసేదేమీలేక రూ.500 నుంచి రూ.600 వరకు ప్రైవేట్ వ్యాపారులకే విక్రయించి నష్టపోతున్నారు.
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో ఏర్పాటు చేసిన మూడు కొనుగోలు కేంద్రాలకు మక్కలు పోటెత్తాయి. రైతులు కొనుగోలు కేంద్రంలో మక్కలను రాశులుగా పోసి పట్టాలు కప్పి గోనె సంచుల కోసం ఎదురు చూస్తున్నారు.

బస్తాలు వచ్చిన రైతులు కాంటా పెట్టి రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రంలో బస్తాలు నింపి ఎదురుచూస్తున్నారు. బస్తాలు రాని రైతులు సొసైటీ నిర్వాహకులను నిలదీస్తున్నారు.
మక్కజొన్న కొనుగోలు ఆలస్యమవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎకరన్నర భూమిలో మక్కజొన్న సాగు చేసిన. చేర్యాల మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మక్కలు కొనుగోలు చేస్తున్నారంటే నాలుగు రోజుల కిత్రం తీసుకువచ్చిన. గోనె సంచులు లేవు, రేపూమాపు అని సిబ్బంది తిప్పుతున్నారు. మక్కజొన్నల కుప్పల వద్ద కూర్చోలేక, ఇంటి పని, వ్యవసాయ పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి వెంటనే మక్కలు కొనుగోలు చేయాలి.
