హైదరాబాద్ జనవరి 20 (నమస్తే తెలంగాణ): భారత సైన్యం కోసం కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫామ్‌ను పోలిన దుస్తులు ఎవరూ తయారు చేయకుండా, వినియోగించకుండా కాపీరైట్ చట్టాన్ని అమలు చేస్తున్నట్టు భారత సైన్యాధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మీ డే సందర్భంగా విడుదల చేసిన ఈ నూతన డిజైన్‌కు సంబంధించిన హక్కులు పదేండ్ల పాటు సైన్యం వద్దే ఉంటాయని పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మరో పదేండ్లు కూడా పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ కింద ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయని, సంబంధిత యూనిఫామ్ భారత సైన్యం యూనిట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి తయారు చేసినా, బహిరంగ మార్కెట్లో విక్రయించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత ఆధారాలతో పిటిషన్ దాఖలు చేయాలని కోరారు.