మహదేవపూర్, జూన్ 4 : జయశంకర్ భూపాపలల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో మేడిగడ్డ (లక్ష్మీబరాజ్), అన్నారం గ్రామంలోని సరస్వతీ బరాజ్‌ను కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా బృందం గురువారం పరిశీలించింది. ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఆదేశాల మేరకు సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్), పుణె ఆధ్వర్యంలో బరాజ్‌ల వద్ద జరుగుతున్న సాంకేతిక పరీక్షలను బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా బరాజ్‌లలో అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న బోర్ హోల్, జీపీఆర్ పనులను తనిఖీ చేసిన బృందం..
పరీక్షల ప్రక్రియను వేగవంతం చేయాలని, బోర్ హోల్ పనుల నిర్వహణ కోసం మరిన్ని యంత్రాలను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించింది. బరాజ్‌ల వద్ద ప్రస్తుత పరిస్థితి, భద్రతా ప్రమాణాలు, సాంకేతిక పరీక్షల పురోగతి తదితర అంశాలపై భారీ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఈ శ్రీనివాస్ గుప్తా, ఎస్ఈ దస్తగిరి, భారీ నీటిపారుదల శాఖ ఈఈ రమేశ్‌బాబు, కన్సల్టెంట్ యాదగిరి, డీఈఈలు సతీశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.