PACS | యాచారం, ఫిబ్రవరి25 : రుణం చెల్లించలేదని సహకార సంఘం సిబ్బంది ఇంటికొచ్చి రైతు బైకును గుంజుకెళ్లారు. అప్పు కట్టిన తర్వాతే బైక్ తీసుకెళ్లాలని తేల్చిచెప్పారు. త్వరలోనే కట్టేస్తామని కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డా పీఏసీఎస్ సిబ్బంది బైక్ను లాక్కెళ్లి తమ కార్యాలయంలో పెట్టుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన ఇక్కె మల్లమ్మ అనే రైతుకు మండలంలోని మేడిపల్లిలో మూడెకరాల పట్టా భూమి ఉన్నది. తన పొలంపై 8 ఏండ్ల క్రితం మండల కేంద్రంలోని సహకార సంఘంలో రూ.3 లక్షల 80 వేల పంటరుణం తీసుకున్నది.
గతంలోనే రూ.2.6లక్షలు చెల్లించింది. మేడిపల్లిలోని మల్లమ్మ భూమిని ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం తీసుకున్న ఆ భూమికి ఎలాంటి రుణం ఉన్నా ప్రభుత్వమే చెల్లిస్తుందని అధికారులు చెప్పినట్టు బాధితురాలు వాపోయింది. ప్రభుత్వం సేకరించిన తన 3 ఎకరాల భూమికిగాను ఎకరాకు రూ.12 లక్షల చొప్పున రూ.36 లక్షలు మేడిపల్లిలోని ఇండియన్ బ్యాంకులో నష్టపరిహారం కింద జమైనట్టు తెలిపింది. ఎనిమిదేళ్లుగా రుణం అడుగని పీఏసీఎస్ అధికారులు, సిబ్బంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాను తీసుకున్న మిగతా బాకీని వడ్డీతో సహా చెల్లించాలని వేధిస్తున్నట్టు మల్లమ్మ కొడుకు పర్వతాలు వాపోయాడు.
పంచాయతీ కార్యాలయం వద్ద నోటీసులు అతికించారని చెప్పాడు. మూడు నాలుగు సార్లు అధికారులు తమ ఇంటికొచ్చారని, ఇటీవలే తన తండ్రి దశదినకర్మ జరిగితే తెల్లారే ఇంటికొచ్చి డబ్బుల కోసం పట్టుబట్టారని వాపోయాడు. మంగళవారం సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి తక్షణమే డబ్బులు కట్టాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు తమ వద్ద లేవని వేడుకున్నా వినకుండా ఇంట్లో ఉన్న బైక్ను బలవంతంగా గుంజుకపోయారని చెప్పాడు. తమ భూమి ఫార్మాసిటీ భూ సేకరణలో పోయిందని, అది టీఎస్ఐఐసీ పేరిట ఆన్లైన్లో ఉన్నదని, ఆ భూమికి రుణం ఎలా చెల్లించాలని వాపోయాడు. కేసీఆర్ హయాంలో పదేండ్లలో బ్యాంకువాళ్లు ఏ ఒక్క రైతును కూడా ఇబ్బంది పెట్టలేదని, కాంగ్రెస్ వచ్చాక నేరుగా ఇండ్లకే వచ్చి బెదిరిస్తున్నారని వాపోయాడు. పీఏసీఎస్ సిబ్బంది లాక్కెళ్లిన బైక్ తమది కాదని, జేసీబీ డ్రైవర్దని చెప్పాడు.
ఈ విషయంపై పీఏసీఎస్ సీఈవో నాగరాజును వివరణ కోరగా రుణం చెల్లించాలని రైతుకు పలుమార్లు నోటీసులిచ్చామని, అయినా స్పందన లేదని, 2016లో రూ.4 లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకొని చెల్లించలేదని తెలిపారు. అసలు, వడ్డీ కలిపి రూ.7 లక్షలకు పైగా రుణం చెల్లించాలని చెప్పారు. లీగల్ ప్రకారమే బకాయిల వసూలు కోసం బైక్ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఫార్మాసిటీ పరిహారం తీసుకున్న రైతు సొసైటీ రుణం చెల్లించలేదని చెప్పారు.