హైదరాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ) : ‘బిల్లులు ఇచ్చినా, ఇవ్వకపోయినా పిల్లలు పస్తులుండొద్దనిఅప్పు చేసి అన్నం వండి పెడుతున్నం. కానీ పది నెలల బిల్లులు రాకపోతే ఎలా వండిపెట్టాలి’ అంటూ మధ్యాహ్న భోజన కార్మికులు కాంగ్రెస్ సర్కారును ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివచ్చి రేవంత్‌రెడ్డి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
మెనూ చార్జీలను రూ.25కి పెంచాలని లేకపోతే డిసెంబర్ చివరి వారంలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉండటంతో అప్పులపాలయ్యామని ఆవేదన వ్యక్తంచేశారు. ఏసీలో కూర్చుండి చెప్పడం కాదని, తమ సమస్యలు విని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్, ఎం నర్సింహ, యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రేమ్‌పావని, జంపాల రవీందర్, కొరిమి సుగుణ, చక్రపాణి, కుంటాల రాములు, ఆది రంగారెడ్డి తదితరులు ఈ ముట్టడిలో పాల్గొన్నారు. అనంతరం కార్మికులంతా డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
బిల్లులియ్యక గోసపెడ్తున్నరు..
కాంగ్రెస్ గెలిస్తే పది వేల జీతమిస్తమన్నరు. రెండేండ్లయినా పత్తాలేదు. పారితోషికం కోసం అధికారులను కలిస్తే మీ పైసలెక్కడికి పోవు, ఏడాదికైనా మీవి మీకే వస్తాయంటున్నారు. అధికారులు ఏడాది పాటు జీతాలు తీసుకోకుండా పనిచేస్తారా?. బిల్లులు, పారితోషికం ఇవ్వకుండా గోసపెడుతున్నరు. ఇచ్చే బియ్యం మంచిగలేవు.. పిల్లలెవరూ సరిగ్గా తినడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంట్లో కూడా ఇవే బియ్యం తింటరా? మాకిచ్చే వంట సామాన్లనే ఆయన ఇంట్లో వాడుతున్నారా?
– నిర్మల్, మధ్యాహ్న భోజన కార్మికురాలు
డబ్బా ప్రచారం ఆపు రేవంత్ : హరీశ్‌రావు
సీఎం రేవంత్ కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తానంటూ చెప్తున్న డబ్బా ప్రచారాన్ని ఆపాల ని మాజీ మంత్రి హరీశ్‌రావు హితవుపలికారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న మహిళ వీడియోను సో మవారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. 13 నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాల్లేవని, అన్నం పెట్టే తాము అప్పులపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ముందుగా వీరికి జీతాలు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.