నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఏప్రిల్ 9: కేంద్రం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ నాయకులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనలు, ధర్నాలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ఖాళీ సిలిండర్లు నెత్తిన పెట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్ బస్టాండ్ వద్ద కట్టెల పొయ్యిపై వంట చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఖాళీ సిలిండర్లను రోడ్డుపై ఉంచారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడులోని ప్రధాన రహదారిపై అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
జూలూరుపాడులో సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, ప్రజాపంథా నాయకులు ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. బూర్గంపహాడ్, ఇల్లెందులో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆదిలాబాద్‌లోని సీపీఐ కార్యాలయం ఎదుట రహదారిపై రాస్తారోకో చేశారు. బోథ్‌లో తహసీల్దార్ సుభాష్చందర్కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు గ్యాస్ సిలిండర్లతో నిరసనకు దిగారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఐ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఎం నాయకులు నిరసన తెలిపారు.