SLBC Tunnel | నాగర్‌కర్నూల్, మార్చి 5: ఎల్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలుసుకోవడం అధికారులు, సహాయబృందాలకు సవాలుగా పరీక్షగా మారింది. 12 రోజుల కిందట ఘటన జరిగితే అప్పటి నుంచి చేపడుతున్న సహాయ చర్యలేవీ ఫలితం లేకుండా పోయాయి.
టన్నెల్లో పేరుకుపోయిన మట్టి, బురదనీటిని తొలగించేందుకు లోకో ట్రైన్ ఉపయోగించిన అధికారులు పూర్తిస్థాయిలో విజయవంతం కాలేకపోయారు. టీబీఎంకు అనుసంధానంగా ఉన్న కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు చేపట్టారు. కానీ కన్వేయర్ బెల్ట్‌తో మట్టి వెలికితీత కొన్ని గంటలు మాత్రమే సాగింది. మంగళవారం మధ్యరాత్రి 3 గంటల ప్రాంతంలో బెల్ట్ తెగిపోవడంతో సహాయ చర్యలకు మళ్లీ ఆటంకం కలిగింది. కొన్ని గంటలపాటు జరిగిన పనుల్లోనూ పెద్ద పురోగతి ఏమీలేదని తెలుస్తున్నది.
కన్వేయర్ బెల్ట్ తెగిపోవడంతో కార్మికుల ఆచూకీ గుర్తింపు మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు సహాయ బృంద సభ్యులు టన్నెల్లో చర్చించుకోవడం కనిపించింది. బెల్ట్‌కు మరమ్మతులు చేసేందుకు రెండు రోజులు సమయం పడుతుందని తెలుస్తున్నది. అప్పటివరకు టన్నెల్లో నీటితోపాటు బురద మరింత పేరుకుపోయే అవకాశమున్నదని కార్మికులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఒక్కో షిఫ్టులో దాదాపు 100 మంది వరకు సహాయ చర్యల్లో పాల్గొంటున్నప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడంతో పనులకు ఫలితం లేకుండాపోతున్నదని రెస్క్యూటీమ్ సభ్యులు చెప్తున్నారు.
టన్నెల్లో ప్రమాదం జరిగిన చోటు నుంచి అంటే 13వ కిలో మీటర్ నుంచి 14 కిలో మీటరు వరకు నాలుగు వరుసల్లో ఏర్పాటు చేసిన సిమెంట్ సెగ్మెంట్లు కూలిపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ ప్రమాదాన్ని బుధవారం రెస్క్యూ టీమ్ బృందాలు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఫలానా చోట కార్మికుల ఆచూకీ ఉండొచ్చని గుర్తించినప్పటికీ బయటకు తీసేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 12 రోజులైనా టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ గుర్తించలేకపోవడంతో కార్మికుల కుటుంబాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.