హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ, ఎంబీసీల దమ్మేందో చూపిస్తామని, కాంగ్రెస్ నేత మోహన్‌రెడ్డి ఖబడ్దార్ అంటూ జాతీయ ఎంబీసీ సంఘాల సమితి కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హెచ్చరించారు. సెల్ఫీ వీడియోలో బీసీలపై మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను ప్రకటించారని, కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని అభ్యర్థులుగా ప్రకటించాయని పేర్కొన్నారు. ‘బీసీలకు దమ్ముధైర్యం ఉంటే.. చేతనైతే బీసీ అభ్యర్థిని ఎలా గెలిపిస్తారో గెలిపించుండ్రి చూస్తాం’ అంటూ మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సవాల్‌గా తీసుకుంటున్నామని, రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీసీ, ఎంబీసీల దమ్ముధైర్యాన్ని, ఐక్యతను చూపిస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 6 స్థానాలను బీసీలకు కేటాయించి సామాజిక న్యాయాన్ని పాటించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. బీసీలు, మాదిగలకు ఒక్క పార్లమెంట్ సీటు కూడా ఇవ్వకుండా కించపరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.