హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోసం, దక్షిణ తెలంగాణకు న్యాయం కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏనాడూ పోరాడిన పాపాన పోలేదని పాలమూరు అధ్యయన వేదిక తీవ్రంగా మండిపడింది. అధికారం, ఆర్జన, పదవుల కోసం తప్పితే త్యాగం చేసిన చరిత్ర కూడా ఆయనకు లేదని ధ్వజమెత్తింది. ఇటీవల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 126 జీవోను వెంకట్రెడ్డి వ్యతిరేకించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు నికర జలాలు ఇవ్వకుండా, ఆ నీటిని శ్రీశైలం ఎడమ కాలువకు కేటాయించాలని వెంకట్రెడ్డి డిమాండ్ చేయడంతోపాటు జీవో రద్దు చేయకపోతే దీక్ష చేస్తానని ప్రకటించడంపై పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం రాఘవాచారి గురువారం ఒక ప్రకటనలో మండిపాడ్డారు. వెంకట్రెడ్డి అసూయకు, స్వార్థానికి, అవగాహనా రాహిత్యానికి ఆ ప్రకటన నిదర్శనమన్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల దుందుభి, మూసీ నదుల నీరు నల్లగొండ జిల్లాలో పారుతున్న సంగతి తెలియదా? అని ప్రశ్నించారు.
పీఆర్ఎల్ఐఎస్ పనులు చేపట్టి వాటిని పూర్తి చేయాలని తన రాజకీయ జీవితంలో ఒకసారి కూడా అడగని ఆయన, నేడు ఆ పథకం పనులకు అడ్డుతగలడానికి పందెం కోడిలా దూసుకొస్తున్నాడని దుయ్యబట్టారు. ఈ దుర్మార్గాన్ని మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రతినిధులు ఖండించాలని పిలుపునిచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ర్టాల హకులు హరిస్తూ, కృష్ణా, గోదావరి నదులను, వాటిమీద నిర్మాణాలను తన చేతిలోకి తీసుకోవడానికి ఉత్తర్వు జారీచేసిందని, రాజ్యాంగానికి, విభజన చట్టానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఆ ఉత్తర్వులను పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒకసారి కూడా వ్యతిరేకించలేదని మండిపడ్డారు. ప్రజల వైపు నుంచి, రాష్ట్రం వైపు నుంచి మాట్లాడకుండా స్వప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని, అవగాహన లేని వెంకట్రెడ్డి లాంటి నాయకులకు వ్యతిరేకంగా దక్షిణ తెలంగాణ ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.