హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర గీతంపై వివాదం రోజురోజుకూ చిలికిచిలికి గాలివానలా మారుతున్నది. మన గీతానికి సంగీతాన్ని ఇక్కడి మట్టిబిడ్డలతోనే అందించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. ఇప్పటికే అందెశ్రీతో కీరవాణిని ఎంపిక చేయడంపై అభ్యంతరం తెలిపిన ప్రముఖ సినీ దర్శకుడు, తెలంగాణ సినీ కార్మిక సంఘాల సమాఖ్య అ ధ్యక్షుడు ప్రేమ్‌రాజ్ ఇనుముల ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘మేం తెలంగాణ రాష్ట్ర గీతం గురించి మాట్లాడుతుంటే చాలా మంది కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ పాట రెహమాన్‌తో చేయించలేదా అని అంటున్నరు.. అది తప్పు. ఆ పాట బతుకమ్మపై చేసింది. కా నీ, అది అధికారిక పాట కాదు కదా. అది వారిష్టం. ఎవరితోనై నా బతుకమ్మ పాటలకు బాణీలు కట్టించొచ్చు. కానీ ఇప్పుడు చర్చ మన రాష్ట్ర అధికారిక గీతం గురిం చి. గతంలో తెలంగాణ గీతాన్ని రామకృష్ణతో పాడించినా అప్పు డు ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేదు. ఇప్పుడు జరుగుతున్నది అధికారికంగా పాడిం చే బృహత్తర కార్యక్రమం. దీనిపై మన తెలంగాణోళ్లు గొంతెందుకు ఎత్తుతున్నారంటే.. ఎన్నో ఏండ్ల నుంచి ఉమ్మడి పాలనలో చితికిపోయి, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి, వీరోచిత పోరాటాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఇక్కడి మట్టి బిడ్డలే పాడాలని భావిస్తున్నం. అందుకే మేం మాట్లాడుతున్నం. కీరవాణిపై మాకు ఎలాంటి భేషజాలు లేవు. ఆయన గొప్ప సంగీత దర్శకుడు. అందెశ్రీ కూడా గొప్ప కవి. కానీ, ఇక్కడి పాట ఇక్కడి వాళ్లే పాడాలి అనేది మన ఆత్మగౌర వం. తెలంగాణలో రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేసేవాళ్లు ఎవ్వరూ లేనట్టుగా ఇక్కడి వారిని కించపరిచేలా అందెశ్రీ మాట్లాడటం బాధాకరం. తెలంగాణ కళాకారుల మీద, తెలంగాణ ప్రజల మీద గౌరవం లేని వ్యక్తి రాసిన పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఏవిధంగా చూడాలనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. కళాకారుల ఆత్మ ఘోషిస్తుంది. రాష్ట్ర గీతంలో పాలుపంచుకునే అర్హత మాకు లేదా? అని ఇక్కడి సంగీత దర్శకులు ఆవేదన చెందుతున్నారు. వారి గురించి మాట్లాడే బాధ్యత నాకుంది. నేను తెలంగాణ ఫిల్మ్ కార్మిక సమాఖ్య అధ్యక్షుడిని. అందెశ్రీ తన సొంతానికి పాట రాసుకొని కీరవాణితో కంపోజ్ చేయిస్తే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర గీతానికి తెలంగాణ సొమ్మును వినియోగిస్తాం. అలాంటి పాటను మనోళ్లు కదా చేయాల్సిందనేది నా అభిప్రాయం.