Tandur Govt Hospital | వికారాబాద్, ఫిబ్రవరి 4, (నమస్తే తెలంగాణ): తాండూరు జిల్లా దవాఖాన బోర్డు మీద కొడంగల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అన్న ఫ్లెక్సీని పెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ దవాఖానను తన నియోజకవర్గమైన కొడంగల్‌కు తరలించేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దవాఖాన పేరు మార్చేందుకు , తరలించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. దవాఖాన బోర్డుపై పెట్టిన ఫ్లెక్సీని చించివేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గానికి తరలించిన మెడికల్ కాలేజీ రద్దు కాకుండా కాపాడుకునేందుకే తాండూరు దవాఖాన పేరును మార్చేందుకు యత్నించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అధికారులు ఏకంగా జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
కొడంగల్ నియోజకవర్గానికి మంజూరు చేసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ విషయంలో పరువు పోయే పరిస్థితులు ఏర్పడటంతో ఎన్‌ఎంసీనే తప్పుదోవ పట్టించి ఏదోవిధంగా అనుమతులు పొందేందుకు ఈ ఎత్తు వేసినట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన వైద్యకళాశాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్‌కు తరలించింది. ఇప్పుడు ఆ కాలేజీకి అనుమతులు పొందడం కోసం పాట్లు పడుతున్నది. మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ నుంచి అనుమతులు రావాలంటే దానికి అనుబంధంగా 220 పడకల అనుబంధ దవాఖాన ఉండాలి.
మెడికల్ కాలేజీకి ఇప్పటివరకూ భూకేటాయింపు మాత్రమే చేసిన ప్రభుత్వం నిర్మాణం చేపట్టలేదు. వారం రోజుల్లో ఎన్ఎంసీ సభ్యులు మెడికల్ కాలేజీకి అనుమతులు ఇచ్చే ముందు తనిఖీల నిమిత్తం కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఇప్పటికిప్పుడు అనుబంధ దవాఖానను పూర్తిచేయడం సాధ్యం కాదు కాబట్టి తాండూర్లోని జిల్లా దవాఖానను కొడంగల్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా చూపేందుకు ప్లాన్చేసినట్టు తెలిసింది. ఇందుకోసం తాండూర్ జిల్లా దవాఖాన బోర్డు మీద కొడంగల్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పేరిట ఉన్న ఫ్లెక్సీని కట్టి, అధికారులు దాని ఫొటోలు, వీడియోలు తీసుకున్నారని స్థానికులు పేర్కొన్నారు.
విషయం తాండూర్ అంతటా తెలియడంతో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలతోపాటు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని ధర్నా నిర్వహించారు. తాండూరులోని జిల్లా దవాఖానను కొడంగల్‌కు తరలించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కేవలం ఎన్ఎంసీని తప్పుదోవ పట్టించే యత్నమా లేక దవాఖానను తాండూరు నుంచి కొడంగల్‌కు తరలించే కుట్రనా అని అనుమానాం వ్యక్తం చేశారు. దవాఖాన బోర్డుపై కట్టిన ఫ్లెక్సీని చించి వేశారు.
తాండూరు జిల్లా దవాఖాన బోర్డుపై కొడంగల్ ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ అన్న ఫ్లెక్సీ ఎందుకు పెట్టారన్న ప్రశ్నకు సూపరింటెండెంట్ పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. కొడంగల్‌లో పెట్టాల్సిన ఫ్లెక్సీని కాంట్రాక్టర్ తెలియక పెట్టారని చెప్పారు. కాంట్రాక్టర్‌కు కొడంగల్, తాండూరుకు మధ్య తేడా తెలియదా అని నిలదీయగా ఆయన నీళ్లు నమిలారు. ఫ్లెక్సీని పెట్టినవారిపై ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించగా.. ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, కేవలం డీసీహెచ్ఎస్కు సమాచారం ఇచ్చామని చెప్పారు.