సిద్దిపేట/చిన్నకోడూరు, అక్టోబర్13: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి సిద్దిపేట జిల్లా నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో స్థానిక 15వ వార్డు గాడిచెర్లపల్లికి చెందిన దళిత సంఘం నాయకులు.. కౌన్సిలర్ సులోచన శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఉమారాణి శ్రీనివాస్‌తో కలిసి బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా రూ.20,016 విరాళం అందజేశారు. మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డికి ఈ మొత్తాన్ని అందజేశారు. అలాగే బక్రిచెప్యాల కుమ్మరి సంఘం నాయకులు నెల్లుట్ల విజయ్, ఎద్దు యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దరిపల్లి శ్రీనివాస్ తదితరులు రూ.5,016 విరాళాన్ని ఇచ్చారు. కాగా చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్ మాడల్ స్కూల్ ఇంటర్ విద్యార్థులు బీఆర్ఎస్కు స్వచ్ఛందంగా ఒక్కో రూపాయి చొప్పున విరాళాన్ని అందజేశారు.