Vijay Deverakonda | సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్‌ను శనివారం మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మరియు ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో గుండె చికిత్సలు పొందుతున్న చిన్నారులతో వారిద్దరూ కాసేపు సరదాగా గడిపి ముచ్చటించారు. అనంతరం జరిగిన వేడుకలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. తనకు హరీష్ రావు అన్న అంటే ఎంతో అభిమానమని, ఆయన్ను ‘సిద్ధిపేటకా షేర్’ అని సంబోధిస్తూ కొనియాడారు. తెలంగాణలో పీడియాట్రిక్ (చిన్నారుల) వైద్య అవసరాలు చాలా ఉన్నాయని గుర్తించి, తాను ఆరోగ్య మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ఆసుపత్రి ఏర్పాటు కోసం హరీష్ రావు ల్యాండ్ కేటాయించారని విజయ్ గుర్తుచేశారు.
రాజకీయాలకు అతీతంగా, నిస్వార్థంగా పిల్లల గుండె జబ్బుల నివారణకు మరియు సమాజ సంక్షేమం కోసం హరీష్ రావు చేస్తున్న కృషి అభినందనీయమని విజయ్ దేవరకొండ కొనియాడారు. పేద పిల్లల గుండె ఆపరేషన్లకు ఆయన అందిస్తున్న సాయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఇలాంటి నాయకులు జనరేషన్‌కు ఒక్కరే ఉంటారని ప్రశంసించారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో పాల్గొనడం, హరీష్ రావు చేస్తున్న ప్రజా సేవను ప్రత్యక్షంగా చూడడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.