హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సర్కిల్‌కు చెందిన ఓ విద్యుత్తు కాంట్రాక్టర్ నిరుడు ఆగస్టులో 11 కేవీ సీటీపీటీ సెట్, 11 కేవీ హెచ్‌టీ టీవీఎం 20/5ఏ కోసం రూ.8 లక్షలు డీడీ చెల్లించారు. కానీ ఇప్పటికీ విద్యుత్ పరికరాలు సరఫరా కాలేదు. ఉప్పల్‌కు చెందిన మరో కాంట్రాక్టర్ ఎల్టీఎక్స్ ఎల్పీఈ కేబుల్ 1 కోర్ 120 స్కేర్ ఎంఎంతో పాటు 10 రకాల పరికరాలకు జూలైలో డీడీ కట్టారు. కానీ సామగ్రి అందలేదు. అధికారులను అడిగితే డిస్కం స్టోర్స్‌లో పరికరాలు లేవని చేతులెత్తేస్తున్నారు. ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యుత్తుశాఖ స్టోర్స్‌లో నో స్టాక్ అంటూ అధికారులు చెప్తుండడంతో కాంట్రాక్టర్లు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా సామగ్రి రాకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దక్షిణ డిస్కంకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 60 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. నెలనెలా శివారు ప్రాంతాల్లో వినియోగదారులు పెరుగుతున్నారు. వీరికి విద్యుత్తు కనెక్షన్లు, సరఫరాకు అవసరమైన సామగ్రిని దక్షిణ డిస్కం సరఫరా చేయలేకపోతున్నది. అరకొరగా ఉన్న సామగ్రిని అడ్డదారిలో లంచాలు ఇచ్చిన వారికి, ప్రజాప్రతినిధుల రికమండేషన్ తెచ్చిన వాళ్లకు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొత్త ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్సులు కరెంటు కనెక్షన్ తీసుకోవాలన్నా, ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలన్నా, విద్యుత్తు శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. శివారు ప్రాంతాల్లోని పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాల బహుళ అంతస్తులకు విద్యుత్తు పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లు నిర్వహిస్తుంటారు. విద్యుత్తుశాఖ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలు సిద్ధం చేస్తారు. ఈ మేరకు దక్షిణ డిస్కంకు డీడీలు చెల్లిస్తే సామగ్రి ఇస్తుంది. ఏడాది క్రితం 10 రోజుల్లోనే సామగ్రి సరఫరా అయ్యేదని, కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియ డీడీల చెల్లింపు దశను దాటడంలేదని కాంట్రాక్టర్లు, వినియోగదారులు వాపోతున్నారు. ప్రైవేటు మార్కెట్లోనూ సామగ్రి దొరుకుకుంది. కానీ నాణ్యమైన సామగ్రి తామే సరఫరా చేస్తామంటూ డిస్కంలు చెప్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా పర్చేజింగ్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ విభాగం ఏర్పాటు చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 5వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. వేసవిలో వినియోగం పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగా డిస్కంల సమ్మర్ ప్లాన్ చేసుకోవాలి. సామగ్రి కోసం టెండర్లు ఖరారు చేసుకోవాలి. కానీ డిస్కంలు పట్టించుకోవడం లేదని, ఓవర్‌లోడ్‌ను ఎలా తట్టుకోవాలని కాంట్రాక్టర్లు, వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. డీడీలు తీసుకుని డిస్కం అధికారులు చోద్యం చూస్తున్నదని మండిపడుతున్నారు. ఒక ఫీడర్ నుంచి కరెంట్ ఇచ్చి, మరొక వైపు సరఫరా బంద్ చేయాల్సిన పరిస్థితి వస్తున్నదని, ఇదే పరిస్థితి కొనసాగితే ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్తు నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికారులు వాపోతున్నారు.