Contractors | ఖైరతాబాద్, మార్చి 7 : ఈ ఏడాదిన్నర కాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు దర్శనాల శంకరయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ, పీఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ తదితర శాఖల్లో 10 లక్షల లోపు పనులు చేసిన కాంట్రాక్టర్లు సుమారు 6 వేల మంది ఉన్నారన్నారు. గత కొన్ని నెలలుగా ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావును అనేకసార్లు కలిసి బిల్లులు చెల్లించాలని అడిగితే.. రేపుమాపు అంటూ దాటవేస్తున్నారని వాపోయారు.
కాంట్రాక్టర్లందరి బిల్లులు 500 కోట్లు ఉన్నాయని, పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు ఇప్పటికే విడుదల చేశారన్నారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని, ఉప ముఖ్యమంత్రి వద్దకు వెళ్దామన్నా కనీసం గేటు ముందు కూడా రానివ్వడం లేదన్నారు. ఇప్పటికే అప్పుల పాలయ్యామని ఆత్మహత్యలే శరణ్యమన్నారు. ఈనెల 22 వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, అప్పటికీ చెల్లించుకుంటే 25న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల మోహన్, ప్రధాన కార్యదర్శి రోసెల్లి కిషన్ రావు, ముఖ్య సలహాదారులు కొప్పుల అజయ్ కుమార్, ఉపాధ్యక్షులు చిందం శ్రీనివాస్, కోశాధికారి పి. రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.