హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ వర్కర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కోఠిలోని హెల్త్ క్యాంపస్లో డీఎంఈకి వినతిపత్రం అందజేశారు. సైదయ్య మాట్లాడుతూ కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని కోరారు.
కార్మికుల వేతనాన్ని నేరుగా ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, కార్మికులు డ్యూటీలో చనిపోతే రూ.10లక్షల ప్రమాద బీమా చెల్లించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో మే 25న మహాధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.