హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధశాఖల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. కష్టాలు తాళలేక ఇప్పటికే పలువురు చిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరికొందరు ప్రాణాలు తీసుకొనేందుకు యత్నించారు. జీతాలు అందకపోవడంతో కుటుంబంలో కలహాలతో ములుగు మున్సిపాలిటీలో మల్టీపర్సస్ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సోమిరెడ్డి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. 15 రోజుల వ్యవధిలోనే ఇద్దరు చిరుద్యోగులు బలన్మరణాలకు పాల్పడ్డారు. ఐదు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శుక్రవారం సూర్యాపేట జిల్లా జనరల్ దవాఖానలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి మధుసూదన్ ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం తాను పనిచేస్తున్న దవాఖానలోనే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతున్నాడు. పెండింగ్ వేతనాలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం, దసరా పండుగ పూట కూడా పస్తులేనా? అనే ఆందోళన ఉద్యోగులను కుంగదీస్తున్నది.