సుల్తాన్‌బజార్, జూన్ 23 : వైద్య, ఆరోగ్య శాఖలో ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని, కార్పొరేషన్ ద్వారా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా వేతనాలు చెల్లించాలని బీఆర్టీయూ అనుబంధ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం కోఠిలో డీఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలోని యూనియన్ కార్యాలయం వద్ద ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖలోని డీఎంఈ, డీపీహెచ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, సీహెచ్ఎఫ్ డబ్ల్యూల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్న 104, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ ఉద్యోగులకు ఐదు నెలలకు పైగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

104 ఉద్యోగులకు 15 నెలలు గా వేతనాలు అందడం లేదని వాపోయారు. అన్ని విభాగాల వివిధ క్యాడర్ల ఉద్యోగులకు పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఐదేండ్లుగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను పంజాబ్, యూపీ తరహాలో రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. క్రాంతి దళ్ నాయకుడు పృథ్వీరాజ్, కాంగ్రెస్ మ్యానిఫెస్టో నాయకుడు జాన్సన్ మాట్లాడుతూ ఏజెన్సీల ద్వారా వేతనాలు అందించడంతో నెలకు రూ.13 వేలే వస్తున్నాయని, వారి కుటుంబ పోషణ భారంగా మారిందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.
ధర్నాలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంకంటి సుభాష్, ప్రభాస్ కుమార్, సాయి, ప్రదేశ్, అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం వారు యూనియన్ నాయకులతో కలిసి డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్, డీపీహెచ్, టీవీవీపీ కార్యాలయం, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించారు.
ఖమ్మం సిటీ, జూన్ 23 : ఖమ్మం జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు దవాఖాన ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆవుల అశోక్ మాట్లాడుతూ.. వివిధ విభాగాల్లో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అదనంగా 150 నర్సుల పోస్టులు అవసరం ఉన్నాయని చెప్పారు. టీహబ్‌లో వందలాది టెస్టులు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నారని, వాస్తవంలోకి వెళితే అందులోని మిషనరీ అంతా మరమ్మతుకు రావడంతో రక్త పరీక్షల ఫలితాలు సరిగా రావడం లేదన్నారు.