హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ నీళ్లు రాని, కరెంట్ లేని ఊర్లు అనేకం ఉన్నాయని..రాష్ట్రపతి అయ్యాకే ద్రౌపది ముర్ము గ్రామానికి విద్యుత్తు సౌకర్యం వచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. 8 ఏండ్లలోనే తెలంగాణలో ప్రతిఇంటికీ తాగునీరు, 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని చెప్పారు. గురువారం హైదరాబాద్ బేగంపేటలోని మ్యారిగోల్డ్ హోటల్లో క్వాలిటీ సరిల్ ఫోరం ఫర్ ఇండియా, హైదరాబాద్ 36వ చాప్టర్ ‘కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కాన్సెప్ట్స్’ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘2022 వరకు కూడా కరెంట్, నీళ్లు లేని ఇల్లు దేశంలో ఉండటం మన దురదృష్టం. 1986లో భారత్, చైనాల ఎకానమీ 470 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం చైనా ఎకానమీ 16 ట్రిలియన్ డాలర్లకు చేరగా, భారత్ ఎకానమీ 3.5కు పరిమితమైంది. అక్కడ దేశాధ్యక్షుడి నుంచి సాధారణ పౌరుడి వరకు దేశాభివృద్ధి అనే నినాదంతో పనిచేస్తారు. కానీ భారత్ మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పోటీపడుతూ..మతవిద్వేషాలు రెచ్చగొడుతూ నాలుగు ఓట్లు సంపాదిస్తే చాలనే లక్ష్యంతో ముందుకు పోతుంది. క్వాలిటీకి కేరాఫ్‌గా ఉన్న భారత్ అట్లనే మిగిలిపోయింది. కేంద్రం విధానాల వల్లే భారత్‌కు పరిశ్రమలు రావట్లేదు. ఉన్నవి సైతం దేశాన్ని వదిలేసి పోతున్నాయి.
తెలంగాణ మాత్రం అతితక్కువ సమయంలోనే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది’ అని వివరించారు. దేశానికి రోల్‌మోడల్ అని చెబుతున్న గుజరాత్లో పవర్‌హాలిడే ప్రకటించారని, మన రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్, గృహాలకు 24 గంటలు నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఆలోచనా తీరుతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు.
విశ్వగురు వద్దంటారు.. జోకర్ ‘ఉచిత’ హామీలు!
బండి సంజయ్ ఉచితాల హామీలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు తీవ్రస్థాయి లో ఫైర్ అయ్యారు. ‘విశ్వగురు ఉచితాలు వద్దంటారు.. జోకర్ ఎంపీ ఉచిత హామీలిస్తాడు..’ అంటూ బండి సంజయ్‌పై ట్వి ట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత ఇండ్లు, ఉచిత వైద్యం, ఉచిత విద్య అమ లు చేస్తామంటూ పాదయాత్రలో బండి సంజయ్ ప్రకటించడంపై గురువారం కేటీఆర్ మండిపడ్డారు. ‘విశ్వగురు (ప్రధాని మోదీని ఉద్దేశించి) ఉచితాలు వద్దంటాడు. ఆ పార్టీ జోకర్ ఎంపీ ఉచిత విద్య, ఆరో గ్యం, ఇండ్లు వాగ్దానం చేశాడు. తెలంగాణ బీజేపీ మూర్ఖత్వం విచిత్రం’ అంటూ కేటీఆర్ విమర్శించారు. ‘ఈ దేశాన్ని పాలిస్తున్నది బీజేపీ కాదా..? మరి పార్లమెంటులో వీటిపై చట్టం చేయకుండా కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకుంటున్నా రు?’ అని ప్రశ్నించారు. దేశంలోని 28 రా ష్ట్రాల ప్రజల కోసం ఉచిత విద్య, వైద్యం, డబుల్ బెడ్ రూం బిల్లులు తెస్తే టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని వివరించారు.