హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16 నుంచి 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతున్నదని టీటీడీ అధికారులు తెలిపారు. శనివారం భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.25 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఆదివారం తిరుమల పెద్దజీయర్ నేతృత్వంలో చాతుర్మాస దీక్షా సంకల్పం నిర్వహించారు.
ఆలయ మహద్వారం వద్ద టీటీడీ ఈవో జే శ్యామలారావు, జేఈవో వీరబ్రహ్మం స్వాగతం పలికారు. అన్నప్రసాదాలకు వాడే సరుకుల్లో లోపాలు గుర్తించినట్లు ఈవో తెలిపారు. తిరుమల లడ్డూ నాణ్యత లేకపోవడానికి అందులో వినియోగించే నెయ్యే కారణమని స్పష్టం చేశారు. వాటన్నింటినీ సరిదిద్ది ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. గత నెల రోజుల్లో గుర్తించిన లోపాలను మీడియాకు వెల్లడించారు. వాటిని సరిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. లడ్డూ తయారీలో వాడే ముడి సరుకుల పరీక్షకు తిరుమలలోనే ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఐ ముందుకొచ్చిందని తెలిపారు.
శాకంబరి దేవిగా శ్రీశైలం భ్రమరాంబ
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శాకంబరి ఉత్సవాలను నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాల్లో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి ఆలయాన్ని కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. కూరగాయలు, వివిధ రకాల పండ్లతో భ్రమరాంబాదేవి మూలమూర్తితోపాటు ఉత్సవమూర్తి, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, గ్రామదేవతైన అంకాలమ్మ అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు, వేదపండితులు ఏఈవో జీ స్వాములు, పర్యవేక్షకులు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.