హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు. వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు, తాగునీరందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు 1500 మంది 24 గంటలు భక్తులకు సేవలందిస్తున్నారు. ఆక్టోపస్ సర్కిల్లో లైన్లోకి ప్రవేశించే భక్తులకు 24 గంటల సమయం పడుతున్నది. తిరుపతి గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం రాత్రి గరుడసేవ ఉంటుందని టీటీడీ అధికారులు వివరించారు. వాహనసేవలో తిరుమలపెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఆగమ సలహాదారులు సీతారామాచార్యులు, మోహనరంగాచార్యులు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి పాల్గొన్నారు.