ఇల్లెందు, సెప్టెంబర్ 19 : అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డెయిలీవేజ్, కాంటింజెంట్ వర్కర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి భిక్షాటనచేశారు. ఈ సందర్భంగా డెయిలీవేజ్ వర్కర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, హాస్టళ్లలో డెయిలీవేజ్, కాంటింజెంట్ వర్కర్లు 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని చెప్పారు. వారికి ఇచ్చే రూ.26 వేల వేతనాన్ని రద్దు చేస్తూ జీవో 64 ద్వారా చర్యలు చేపట్టారని ఆరోపించారు. వెంటనే ఆ జీవోను రద్దు చేసి, పాత పద్ధతి ప్రకారమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.