ఖైరతాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : రిజర్వేషన్ల కోసం తెలంగాణలో జరిగే బీసీ ఉద్యమం దేశానికే నాంది పలికేలా ఉం డాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నా రు. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘బీసీలకు 42% రిజర్వేషన్లు-న్యాయ వివాదాలు పరిష్కారం’ అంశంపై బీసీ సంఘాలు, విద్యావంతులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సంఘాలతో సమాలోచన సమావే శం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయన్న ఆశతో సర్పంచ్, ఎంపీటీ సీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల కోసం ఆస్తులను అమ్ముకుంటున్నారని తెలిపారు. గెలిచిన రెండుమూడు నెలల తర్వాత ఈ రిజర్వేషన్లు చెల్లవని కోర్టు తీర్పు వస్తే వారి పదవులు పోతాయని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లకు అనుగుణంగా తీర్పు వచ్చే అవకాశం లేదని, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నదని, బీసీలను రోడ్డుపై పడేసే కుట్ర జరుగుతున్నదని అనుమానం వ్యక్తంచేశారు. కాబట్టి బీసీలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయం లో డిసెంబర్ 9న వచ్చిన ప్రకటన వెనక్కి వెళ్లగానే కేసీఆర్ నేతృత్వంలో ప్రజలందరూ ఏక మై తెలంగాణను తెచ్చుకున్న స్ఫూర్తితో బీసీ ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రాణం ఉన్నతంత వరకు బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతానని, బీసీలు ఎలాంటి ఉద్యమాలు చేపట్టినా తాను ముందుంటానని హామీనిచ్చారు. కోర్టు తీర్పు ఆధారంగా ముందుకు వెళ్దామని, రెండు రోజుల్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో 60 శాతానికిపైగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటే అది ప్రభుత్వ దయ కాదని, బీసీల హక్కు అని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్రాం త ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం లో లేదంటూ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, ఆర్టికల్ 15(4), 16(4)ను ఒకసారి చదువుకోవాలని సూచించారు. కులగణనలో 56% బీసీలు ఉన్నట్టు తేలిందని, ప్రభుత్వం 42% ఇస్తామనడం మోసమే అవుతుందని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్న ఆలోచన వచ్చినప్పుడల్లా ఒకే సామాజికవర్గం దశాబ్దాలుగా అడ్డుకుంటూ వస్తున్నదని, హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది కూడా ఆ సామాజికవర్గమేనని పేర్కొన్నారు. బీజేపీకి మొదటి నుంచీ బీసీలకు రిజరేషన్లు ఇవ్వాలన్న ఆలోచనలేదని, అది బీసీ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. గతంలో దివంగత ప్రధాని వీపీ సింగ్ రిజర్వేషన్లు ఇవ్వాలని ప్ర యత్నిస్తే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టింది బీజేపీయేనని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లు కావాలంటే న్యాయపోరాటంతో పాటు బీసీ ప్రజల ను చైతన్యవంతులను చేయాలని, తెలంగాణ ఉద్యమం తరహాలో బడుగుల ఉద్యమాన్ని చే పట్టాలని సూచించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజుగౌడ్, రాష్ట్ర కన్వీనర్ వెంకన్న గౌడ్, బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుమార్‌గౌడ్, ప్రణవ్చందర్, సర్పంచ్ల సంఘం జేఏసీ చైర్మన్ యాదయ్యగౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ్, గౌడ జనహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఆలిండియా ఓబీసీ స్టూడెం ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్‌గౌడ్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ శకుని పాత్ర పోషిస్తున్నారని, బీసీలను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య నిప్పులు చెరిగారు. కులగణన నివేదిక బయటపెడితే నిజాలు వెలుగుచూసాయనన్న భయంతో దానిని దాచిపెట్టి, బీసీలను 10% తగ్గించి, అగ్రవర్ణాలకు 10% పెంచారని విమర్శించారు. ఫిబ్రవరిలో అన్ని పార్టీలు, బీసీ మేధావుల సమక్షంలో డ్రాఫ్ట్ యాక్ట్‌ను తయారుచేసి ఇచ్చామని, దానిని బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ బిల్లులను ఢిల్లీకి పంపి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు.