హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారు కోకాపేటలోని మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ట్రస్ట్‌బోర్డు నిర్ణయించింది. ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన సోమవారం ట్రస్ట్‌బోర్డు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ట్రస్ట్‌బోర్డు సభ్యులు సర్దార్ పుటం పురుషోత్తమ్‌రావు, వీ ప్రకాశ్, సీ విఠల్, రౌతు కనకయ్య, తూడి ప్రవీణ్, రమేశ్ హజారి, మంగళారపు లక్ష్మణ్, పన్నా ల విష్ణువర్ధన్ తదితరులు హాజరయ్యారు. మున్నూరుకాపు టవర్స్ నిర్మాణానికి గత కేసీఆర్ ప్రభుత్వం కోకాపేటలో ఐదెకరాల స్థలాన్ని కేటాయించగా, ఈ స్థలంలో అధునాతన పద్ధతుల్లో భవిష్యత్తరాలకు ఉపయోగపడేలా ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. తాజాగా నిర్వహించిన ట్రస్ట్‌బోర్డు సమావేశంలో సభ్యులు పలు సూచనలు చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశ, విదేశాల్లో నివసిస్తున్న వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించాలని సమావేశంలో తీర్మానించారు.
ఎమ్మెల్యే దానం రూ.50లక్షల విరాళం..
భవన నిర్మాణానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రూ.50 లక్షల విరాళం అం దజేశారు. ఇందుకు సంబంధించిన రసీదును ట్రస్ట్ బోర్డు చైర్మన్ వద్దిరాజు రవిచంద్రకు అందజేశారు. సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన వసుంధర బిల్డ్ ఎక్స్ చైర్మన్, కాపు నేత పోతురెడ్డి రమేశ్‌బాబు ఇప్పటికే వితరణ చేసిన రూ.10 లక్షలకు కొనసాగింపుగా మున్ముందు మరింత చేయూతనందిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు గంగుల, దానంతోపాటు ఫౌండేషన్ సభ్యులను సన్మానించారు. సమావేశంలో గంగసాని నవీన్ పటేల్, జెన్నాయికోడె జగన్మోహన్, బేతంచర్ల శ్రీనివాస్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.