హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మాణ రంగం కళ తప్పింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ నిర్మాణాల అనుమతుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు జీహెచ్ఎంసీ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. గత 15 నెలలుగా కొనసాగుతున్న స్తబ్ధతకు ప్రభుత్వ విధానాల్లోని లోపాలే కారణమని రియల్టర్లు, బిల్డర్లు ఎండగడుతుండటంతో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. బీఆర్ఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం జోరుగా ముందుకు సాగడంతో టౌన్‌ప్లానింగ్ విభాగానికి వరుసగా మూడేండ్లు రికార్డు స్థాయిలో రాబడి వచ్చింది.
2021-2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1,144.08 కోట్లు, 22-23లో రూ.1,454.76 కోట్లు, 2023-24లో రూ.1,107.65 కోట్ల ఆదాయం లభించగా.. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇప్పటివరకు రూ.900 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగానికి రూ.1,595.56 కోట్ల ఆదా యం వస్తుందని అధికారులు తొలుత అంచనా వేసినప్పటికీ ఆ తర్వాత దాన్ని రూ.1,050 కోట్లకు తగ్గించారు. బడా నిర్మాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, రియల్టర్లు జంకుతుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు తగ్గిపోయాయి. 2023లో మొత్తంలో 39,869 నిర్మాణాలకు అనుమతులు లభించగా.. నిరుడు ఆ సంఖ్య 14,043కు దిగజారింది. ఈ ఏడాది కూడా పరిస్థితి అలాగే ఉన్నట్టు స్పష్టమవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 1,201.15 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.