హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): డోర్నకల్-గద్వాల, డోర్నకల్-మిర్యాలగూడ మధ్య కొత్త రైల్వే మార్గాల ఏర్పాటుకు ముందడుగు పడింది. నిరుడు రైల్వే బోర్డు తీసుకున్న నిర్ణయం కార్యారూపం దాల్చుతున్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలిస్తున్నాయి. ఈ రెండు రైల్వే లైన్లు వేయడం కోసం గతంలోనే సర్వే పూర్తయింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ల తయారీ చివరి దశకు చేరుకున్నది.
ఆగస్టు చివరి నాటికి డీపీఆర్‌లను రైల్వే బోర్డుకు సమర్పించే అవకాశాలు ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) కీలక అధికారి తెలిపారు. డీపీఆర్‌ను దాఖలు చేసిన తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. రెండు లైన్లకు కలిపి రైల్వేశాఖ మొత్తం రూ.7,460 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇందులో డోర్నకల్-గద్వాల ప్రాజెక్టుకు మొత్తం వ్యయం రూ.5,300 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మార్గం కోసం టోకెన్ కింద రూ.7.40 కోట్లు కూడా విడుదల చేశారు. డోర్నకల్ -గద్వాల మధ్య నూతన రైల్వే లైన్‌ను కాచిగూడ రైల్వే లైన్‌కు, డోర్నకల్-మిర్యాలగూడ రైల్వే లైన్‌ను గుంటూరు-బీబీనగర్ లైన్‌కు అనుసంధానించనున్నట్టు చెప్పారు. ఇవి అందుబాటులోకి వచ్చినట్టయితే ఆయా ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడి, తద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమని వివరించారు.