రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం నిర్మాణ పనుల్లో వేగం పెరగనున్నది. నాలుగు నెలలు ఆలస్యంగానైనా భూసేకరణ గెజిట్లను కేంద్రం విడుదల చేయడంతో భూసేకరణకు మార్గం సుగమమైంది. ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో అవసరమైన భూమి సేకరించాలన్న లక్ష్యంతో అధికారులు కసరత్తుచేస్తున్నారు. ఈ ట్రిపుల్ ఆర్లో 11 జంక్షన్లు రానున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. భూసేకరణ గెజిట్ల విడుదల నాలుగు నెలలు ఆలస్యం చేసిన కేంద్రం.. ఇంటా, బయటా విమర్శలు రావడంతో ఎట్టకేలకు గెజిట్లు విడుదల చేసింది. వాస్తవానికి 158.645 కిలోమీటర్ల ఉత్తరభాగం ట్రిపుల్ఆర్ నిర్మాణం కోసం భూసేకరణకు 8 యూనిట్లను ఏర్పాటుచేసింది. దీనికి ముందుగా కేంద్రం నాగ్పూర్ కేంద్రంగా పనిచేసే కే అండ్ జే సంస్థ అలైన్మెంట్కు తుది రూపు ఇచ్చింది. ఆ తరువాత 4 జిల్లాలు, 19 మండలాల్లోని 113 గ్రామాల మీదుగా రింగ్ రోడ్ వెళ్తుందని నిర్ణయించారు. ఈ మేరకు ప్రాథమిక గెజిట్ విడుదల చేసిన కేంద్రం, ఆ తరువాత వరుసగా భూసేకరణ గెజిట్లు విడుదల చేయాల్సి ఉన్నది. మే నెలలో మూడు యూనిట్లకు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన కేంద్ర రవాణశాఖ, మిగిలిన గెజిట్లు విడుదల చేయడానికి 4 నెలలు సమయం తీసుకున్నది. తాజాగా మరో 4 యూనిట్లకు గెజిట్లు విడుదలచేసింది. దీంతో భూసేకరణకు మార్గం సుగమమైంది. తుప్రాన్ ఆర్డీవో పరిధిలోని గ్రామాల్లో 176 హెక్టార్ల భూసేకరణకు కూడా శుక్రవారం గెజిట్ విడుదలైంది.
ట్రిపుల్ఆర్ కోసం గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి, భువనగిరి ఆర్డీవో పరిధిలోని యూనిట్లలో 2,720 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన రెండో విడత గెజిట్లో కేంద్రం స్పష్టంగా తెలిపింది. గ్రామాలవారీగా, సర్వే నంబర్లవారీగా భూముల వివరాలను పేర్కొన్నది. ఇందులో నర్సాపూర్ డివిజన్లో కాజీపేట గ్రామంలో ఆరు ఎకరాలకుపైగా అటవీ భూమిని కూడా సేకరిస్తున్నారు.
ట్రిపుల్ఆర్ నిర్మాణానికి కావాల్సిన భూమిని ఆరు నెలల్లో పూర్తిగా సేకరించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేరణకు పూర్తిగా సహకరించడంతోపాటు భూసేకరణ ఖర్చులో సగం భరించడానికి సిద్ధం కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూసేకరణ సాగనున్నది. ఇప్పటికే భూసేకరణపై అభ్యంతరాలను స్వీకరించే కార్యక్రమాన్ని అధికారులు మొదలు పెట్టారు. 21 రోజుల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తరువాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. అనంతరం అవార్డు పాస్ చేసి భూమిని స్వాధీనం చేసుకుంటారు.
జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేయడంలో కీలకమైన జంక్షన్ల డిజైన్లు ఫైనల్ చేయడం కోసమే భూసేకరణ గెజిట్లు విడుదలలో కాస్త ఆలస్యమైందని అధికారులు చెప్తున్నారు. ఒకసారి భూసేకరణ గెజిట్ విడుదల చేసిన తరువాత, తిరిగి రివైజ్డ్ గెజిట్లు విడుదల చేస్తే ప్రజల్లో అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భూసేకరణ గెజిట్ల విడుదలలో ఆలస్యం జరిగిందని అంటున్నారు. ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్లో 11 జంక్షన్లు వచ్చాయని, వాటిని ఫైనల్ చేశాకే గెజిట్ విడుదల చేశామన్నారు.