మహదేవపూర్/కాళేశ్వరం, జూన్ 9: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు నిర్మాణ సంస్థ ఎల్టీ ఆధ్వర్యంలో ఏడో బ్లాక్ వద్ద మరమ్మతు పనులు జరుగుతున్నాయి. సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసెర్చ్ స్టేషన్) బృందం పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా బరాజ్ లోపాలపై అధ్యయనానికి కుంగిన ప్రాంతంలో పలు రకాల నమూనాలు సేకరిస్తున్నారు. బరాజ్‌లోని మొత్తం 85 గేట్లకు 81 గేట్లు ఎత్తి ఏడో బ్లాక్‌లోని 18, 19, 20, 21వ గేట్లను ఎత్తేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దెబ్బతిన్న పియర్ల వద్ద ఏర్పడ్డ ఖాళీ ప్రదేశాల్లో సిమెంట్, ఇసుక, కెమికల్ మిశ్రమంతో గ్రౌటింగ్ చేస్తున్నారు. బరాజ్ దిగువ ప్రాంతంలో నీటి ప్రవాహానికి పియర్ల చుట్టూ ఉన్న ఇసుక కొట్టుకుపోకుండా భారీ యంత్రాలు, క్రేన్ల సాయంతో షీట్‌ఫైల్స్, సీసీ బ్లాక్‌లను అమర్చుతున్నారు.
అన్నారం (సరస్వతీ) బరాజ్‌లోనూ సీసీ బ్లాక్ పనులు కొనసాగుతున్నాయి. బ్లాక్‌ల మధ్యలో ఇసుక నింపుతున్నారు. బరాజ్ ముందు భాగంలో ఇప్పటికే 2 లక్షల టన్నుల ఇసుక తీయగా, మరో 7 లక్షల టన్నులు తీయాల్సి ఉన్నది. అలాగే బరాజ్‌లో ఎన్డీఎస్ఏ సూచనల మేరకు సోమవారం బోర్ లాక్ పనులు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు.