(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను చట్టసభల్లోకి వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేరని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ, అడ్డుకుంటే, ఆ చర్య ముమ్మాటికీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్‌ను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల రంగు టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. లోపలికి వెళ్తున్న ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకొన్నాయి. ఈ క్రమంలో అసలు ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు ఉన్నదా? ఈ విషయంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి? అనే దానిపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చట్టసభల్లోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు ఉండబోదని లోక్‌సభ, శాసనసభ మాజీ సెక్రటరీ జనరల్స్, రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేసే అధికారం ప్రజాప్రతినిధులకు కూడా ఉన్నదని గుర్తుచేస్తున్నారు. సోమవారం జరిగిన ఘటన గురించి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల రంగు చొక్కాలు ధరించారన్న కారణంతో సభలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్‌ను ఉల్లంఘించడమే అవుతుందని గుర్తుచేస్తున్నారు. ఎమ్మెల్యేలు నిరసనలు తెలియజేసిన విధానంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, సభలో స్పీకర్ నిర్ణయం తీసుకొంటారని, అయితే, అదేమీ లేకుండానే.. ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించకుండానే అడ్డుకోవడం ముమ్మాటికీ నిబంధనలను కాలరాయడమేనని గుర్తుచేస్తున్నారు.
ఆర్టికల్ 194 ప్రకారం.. రాష్ర్టాల శాసనసభ సభ్యులకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక హక్కులు, అధికారాలతోపాటు రక్షణలను కూడా కల్పించిందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. సభలో ప్రజాప్రతినిధి ప్రవర్తన సరిగ్గా లేకుంటే, ఆ రోజు సభ ముగిసేవరకూ సదరు ప్రతినిధిని రూల్ 339 ప్రకారం స్పీకర్ బయటకు వెళ్లమని చెప్పొచ్చని, అలాగే, స్పీకర్ హెచ్చరికలను పట్టించుకోకుండా పదేపదే సభను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే రూల్ 340 ప్రకారం సదరు ప్రజాప్రతినిధిపై స్పీకర్ సమావేశకాలంపాటు సస్పెండ్ చేయవచ్చని చెప్తున్నారు.
ఈ నిబంధనలు అన్నీ సభలోకి ప్రజాప్రతినిధులు ప్రవేశించిన తర్వాత స్పీకర్ తీసుకొనే నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని గుర్తుచేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో ఇలాంటివేమీ జరుగలేదని, అసలు సభలోకి ప్రవేశించకుండానే గేట్ దగ్గరే అడ్డుకోవడం ముమ్మాటికీ నిబంధనలను కాలరాయడమేనని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడానికి వాళ్లేమీ సస్పెండ్ కాలేదు కదా? అని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ ఒకరు అభిప్రాయపడ్డారు.