Karimnagar | కరీంనగర్ : తన కూతురును డాక్టర్ చేయాలని తెలంగాణ అమరుడు పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య కన్న కలలను సీఎం కేసీఆర్ ఇప్పటికే నిజం చేశారు. ఇప్పుడు పీజీ చదించేందుకు ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి అమరుల కుటుంబాల పట్ల ఆయనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు.
ఇప్పటికే తమ కుటుంబానికి అండగా నిలబడిన సీఎం కేసీఆర్ ఇప్పుడు తన కూతురు ప్రియాంకను పీజీ చదివిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతి కృతజ్ఞతలు చెబుతున్నారు. కాగా, శనివారం కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో ప్రియాంక పీజీలో అడ్మిషన్ పొందారు. కేసీఆరే తన ఫీజు చెల్లిస్తానని చెప్పారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
ఎంబీబీఎస్ పూర్తి చేసి కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి బస్తీ దవాఖానలో వైద్యురాలిగా సేవలు అందిస్తున్న ప్రియాంక పీజీలో గైనకాలజిస్టయినా, జనరల్ సర్జన్ అయినా చేయాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని హైదరాబాద్‌లో జరిగిన అమరజ్యోతి ఆవిష్కరణ సమయంలో తన తల్లి పద్మావతితో కలిసి సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీటు సంపాదించుకుంటే తప్పకుండా చదివిస్తానని సీఎం కేసీఆర్ ప్రియాంకకు హామీ ఇచ్చారు. అప్పటికే నీట్లో పీజీ ఎంట్రెన్స్ రాసిన ప్రియాంకకు బీ కేటగిరీ మేనేజ్మెంట్ కోటాలో జనరల్ సర్జన్ సీటు వచ్చింది. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు తెలుపడంతో ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రియాంక పీజీ చదివేందుకు ఖర్చయ్యే రూ. 24 లక్షలు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించడంతో శనివారం కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో పీజీలో అడ్మిషన్ పొందారు.