హైదరాబాద్/కరీంనగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజులు.. ఒకవైపు ఆమరణదీక్షలో ఉన్న ఉద్యమ సారథి కేసీఆర్ అరెస్టు.. పాలకుల అణచివేతలు.. ప్రత్యేక తెలంగాణ రాదేమోనన్న సంశయంతో కలతచెంది ‘తన మరణంతోనైనా ప్రత్యేక తెలంగాణ సిద్ధిస్తుంది’ అని తలచిన ఆనాటి తెలంగాణ ముద్దుబిడ్డ, కామారెడ్డికి చెందిన కానిస్టేబుల్ కిష్టయ్య 2009 డిసెంబర్ 1న తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్నాడు. ఆయన అమరత్వం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ త్యాగధనుడి కుటుంబానికి గత పదేండ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచి, ఆసరా కల్పించింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కుటుంబంపై కాఠిన్యం ప్రదర్శిస్తున్నది. ఆయన భార్య ఉద్యోగ ప్రమోషన్ విషయంలో అవమానాల పాల్జేస్తున్నది.
తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య యామ (పుట్టకొక్కుల) పద్మావతికి ఉద్యమ సమయంలోనే కారుణ్య నియామకం కింద ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విభాగంలో ఆఫీస్ సబార్డినేట్‌గా ఉద్యోగం ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక అమరుడు కిష్టయ్య కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. కిష్టయ్య కూతురు ప్రియాంక ఎంబీబీఎస్ చదువు కోసం ఏడాదికి రూ.5 లక్షల చొప్పున బీఆర్ఎస్ పార్టీ చెల్లించింది.
ప్రియాం క మెడికల్ పీజీ చదివేందుకు రూ.24 లక్షలను స్వయంగా కేసీఆర్ చెల్లించారు. ఉద్యోగం చేస్తూ, ఇద్దరు పిల్లలను చదివించుకుంటూనే పద్మావతి ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె విద్యార్హతలను బట్టి టైపిస్టుగా పదోన్నతి కల్పించారు. లైబ్రేరియన్ కావాలని, ఆ మేరకు అర్హతలు కూడా సాధించారు. కానీ సీనియారిటీ సరిపోక ఒక్క అడుగుదూరంలో ఆగిపోయారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ అమరుడి భార్య తన ఉద్యోగ ప్రమోషన్ కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది.
2023 సెప్టెంబర్‌లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శాఖ మల్టిజోన్-1 పరిధిలో పదోన్నతులకు అర్హులైన సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, లైబ్రేరియన్లను గుర్తించి ప్యానల్లో చేర్చింది. అప్పటికి లైబ్రేరియన్ ఖాళీ పోస్టులు 60 ఉండగా 10 శాతం అదనంగా అంటే 65 మందిని ఈ ప్యానల్లో చేర్చింది. పద్మావతి కంటే ముందు సీనియారిటీ ఉన్న 60 మందికి లైబ్రేరియన్లుగా పోస్టింగ్ ఇచ్చారు. సీనియారిటీ జాబితా ప్రకారం పద్మావతిది 61వ సంఖ్య. తన పదోన్నతి తృటిలో తప్పిపోవడంతో పద్మావతి ఉన్నతాధికారులను సంప్రదించారు.
60 మందిలో ఎవరైనా చేరకుంటే అవకాశం కల్పిస్తామని ఆ అధికారులు పద్మావతికి హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఆ 60 మందిలో ముగ్గురు వ్యక్తిగత కారణాలతో లైబ్రేరియన్లుగా చేరడం లేదని సంబంధిత అధికారులకు రాతపూర్వంగా రాసిచ్చారు. ఈ నేపథ్యంలో తనకు ఎలాగైనా లైబ్రేరియన్‌గా పదోన్నతి వస్తుందని సంతోషపడిన పద్మావతికి ఆనాటి నుంచి ఇప్పటివరకు ఆ అవకాశం దక్కలేదు.
ఇంటర్ విద్య కమిషనర్ శృతి ఓజా సహా ఇతర అధికారులను కలిసి తనకు న్యాయం చేయాలని పద్మావతి పలుసార్లు మొరపెట్టుకున్నది. ఇంటర్ విద్య కమిషనరేట్‌లోని ఓ ఆంధ్రా ప్రాంత అధికారిణి ఆమెకు పదోన్నతి కల్పించకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పద్మావతిని 100 సార్లు కార్యాలయం చుట్టూ తిప్పించుకొని తాజాగా ‘ప్యానల్ ఇయర్ పూర్తయింది. నీకు పదోన్నతి ఇచ్చేదే లేదు. నీకు దిక్కున్న చోట చెప్పుకోపో’ అని చెప్పినట్టుగా విశ్వసనీయ సమాచారం.
కనీసం తన భర్త త్యాగాన్ని గుర్తించైనా తనకు పదోన్నతి కల్పించాలని వేడుకున్నా అధికారులు కనికరించలేదు. ఈ దయనీయ పరిస్థితుల్లో పద్మావతి ఇటీవలే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. తాను ఎదుర్కొన్న అవమానాలను విన్నవించుకుంటూ ఆయన ఎదుటే కన్నీటిపర్యంతమయ్యారు. కనీసం ఇపుడైనా ఆమెకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి.
కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతికి న్యాయం చేస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం భరోసా ఇచ్చారు. పద్మావతి పదోన్నతి విషయంపై ‘నమస్తే తెలంగాణ’ ఆయన్ను ఆరా తీయగా, ఇటీవలే తనను పద్మావతి కలిసి వినతిపత్రం ఇచ్చారని, పదోన్నతి కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఆమెకు తప్పకుండా న్యాయం చేస్తా చెప్పారు.