మలక్‌పేట, జనవరి 1: కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ జటావత్ కిరణ్(36) ఆస్మాన్‌గఢ్ ఎస్టీ బస్తీలో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిసైన కిరణ్ నిత్యం భార్య, పిల్లలను వేధిస్తున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా నాలుగు రోజులు ముందుగానే లీవ్ పెట్టాడు. బుధవారం ఉదయం కూడా మద్యం తాగి ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంటి నుంచి వారిని బయటకు పంపి తలుపులు వేసుకున్నాడు. గతంలో కూడా పలుమార్లు వీరిని ఇలాగే బయటకు పంపించి తలుపులు వేసేవాడు. ఈసారి కూడా అలా చేయడంతో వారు ఇరుగు, పొరుగు ఇండ్లలో ఉండి భోజనం కోసం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో కిరణ్ తలుపులు ఎంతకీ తీయలేదు. కిటికిలోంచి తొంగి చూడగా, కిరణ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబసభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, అప్పటికే కిరణ్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించి, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.